AP: 24 గంటల్లో అల్పపీడనం

17 Aug, 2021 08:21 IST|Sakshi

ఉత్తర, దక్షిణ కోస్తాలో ఒకటి లేక రెండుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు

మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగాను, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం తెలిపారు. ఉత్తరాంధ్రలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాగే, రాబోయే మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

తీరం వెంబడి గంటకు 40–50 కీలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక సోమవారం పలుచోట్ల వర్షాలు కురవగా, విజయనగరం జిల్లా వేపాడులో అత్యధికంగా 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 

మరిన్ని వార్తలు