పృథ్వీతేజ్ సంకల్పం.. వైఎస్‌ జగన్‌ ప్రశంసలు

14 Aug, 2020 10:50 IST|Sakshi
ప్రజాసంకల్పయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన దృశ్యం 

ఐఏఎస్‌ శిక్షణ పూర్తిచేసుకున్న ద్వారకాతిరుమల యువకుడు 

కడప జిల్లాలో సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్

సాక్షి, ‌ద్వారకాతిరుమల: ప్రజలకు సేవ చేయాలన్న ఆ యువకుడి సంకల్పం.. రూ.కోటి జీతాన్ని వదులుకునేలా చేసింది. పట్టుదలతో తాను ఎంచుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించి తొలి ప్రయత్నంలో ఐఏఎస్‌ అయిన ఆ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు. కన్నవారికి, పుట్టిన గడ్డకు మంచి పేరు తెచ్చి, ఇటీవల కడప జిల్లాలో రెవెన్యూ డివిజన్‌ సబ్‌కలెక్టర్‌గా పోస్టింగ్‌ పొందిన ద్వారకాతిరుమలకు చెందిన యిమ్మడి పృథ్వీతేజ్‌ విజయగాథ..  

సివిల్స్‌లో 24వ ర్యాంక్‌ 
బంగారు నగల వ్యాపారి యిమ్మడి శ్రీనివాసరావు, రాణి దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఏకైక కుమారుడు పృథ్వీతేజ్‌ చిన్ననాటి నుంచి చదువులో రాణించారు. ప్రజాసేవ చేసే ఉన్నత ఉద్యోగం చేయాలనే లక్ష్యాన్ని చిన్నతనంలో ఎంచుకున్నారు. ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ లక్ష్య సాధనవైపు దూసుకెళ్లారు. 24 ఏళ్ల వయసులోనే సివిల్స్‌లో 24వ ర్యాంక్‌ సాధించి ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ (ఐఏఎస్‌)కు ఎంపికయ్యారు. శిక్షణ పూర్తిచేసుకున్న ఆయన ఇటీవల కడప జిల్లా రెవెన్యూ డివిజన్‌ సబ్‌కలెక్టర్‌గా తొలి పోస్టింగ్‌ పొందారు.

కుటుంబసభ్యులతో పృథ్వీతేజ్‌ 

జగన్‌ ప్రశంసలు పొంది.. 
నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో 2018 మే 19న ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పృథ్వీతేజ్, ఆయన తండ్రి శ్రీనివాసరావు కలుసుకున్నారు. అప్పటికే సివిల్స్‌లో సత్తాచాటిన పృథ్వీతేజ్‌ను జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు.  

రూ.కోటి ప్యాకేజీని వదులుకుని..  
ఇంజినీరింగ్‌ పూర్తయిన వెంటనే సౌత్‌ కొరియాలోని సామ్‌సంగ్‌ కంపెనీలో ఏడాదికి రూ.కోటి ప్యాకేజీతో ఏడాదిపాటు పృథీ్వతేజ్‌ ఉద్యోగం చేశారు. అయితే ఉద్యోగం, సంపాదన ఆయనకు సంతృప్తి కలిగించలేదు. తాను కోరుకున్నది సాధించాలన్న దృఢ సంకల్పంతో ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్‌ దిశగా అడుగులు వేశారు.  

కుటుంబసభ్యులతో పృథ్వీతేజ్‌ 

విద్యాభ్యాసం 
పృథ్వీతేజ్‌ 3వ తరగతి వరకు ద్వారకాతిరుమల మండలంలోని రాళ్లకుంట సెయింట్‌ గ్జేవియర్‌ పాఠశాలలో, ఆ తర్వాత 6వ తరగతి వరకు డీపాల్‌ పాఠశాలలో చదివారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలోని విశ్వభారతి పాఠశాలలో విద్యనభ్యసించారు. ఇంటర్‌ గూడవల్లి శ్రీచైతన్య కళాశాలలో చదువుతూ 2011లో ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఆల్‌ఇండియా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముంబైలో ఐఐటీ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు.  

కోచింగ్‌ తీసుకోకుండానే..  
ఐఏఎస్‌ సాధించేందుకు ఎటువంటి కోచింగ్‌ తీసుకోకుండానే పృథ్వీతేజ్‌ ‌ సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. పట్టుదలతో చదివి, పరీక్ష రాసిన ఆయన 2018లో విడుదలైన ఫలితాల్లో ఆల్‌ ఇండియాలో 24వ ర్యాంక్‌ను సాధించారు. ఐఐటీలో ర్యాంకు సాధించిన పృథ్వీతేజ్‌ ‌ అనతికాలంలోనే సివిల్స్‌లో సత్తాచాటుతారని ఎవరూ ఊహించలేదు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం గెలుపును ముందే ఊహించారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, నమ్మకం, పృథ్వీతేజ్‌ పట్టుదల, కృషి ఆయన్ను ఈస్థాయిలో కూర్చోబెట్టింది.   

మరిన్ని వార్తలు