విద్యుత్‌ సమస్యలపైనా సచివాలయాల్లో తక్షణ స్పందన

5 May, 2021 04:57 IST|Sakshi

విద్యుత్‌ అంతరాయాలపై తక్షణమే స్పందించే యంత్రాంగం

గంటల్లోనే సచివాలయ సిబ్బందితో పరిష్కారం

ఏడాదిలోనే 37 శాతం తగ్గిన అంతరాయాలు

రైతు క్షేత్రాలకూ తక్షణ సహాయం

సాక్షి, అమరావతి: కరోనా వేళ జనం ఇల్లు కదల్లేని పరిస్థితి. ఈ దృష్ట్యా క్షణం కూడా కరెంట్‌ పోకుండా చూస్తున్నారు. ఈ ప్రయత్నంలో గ్రామ సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్నాయి. విద్యుత్‌ తీగలు తెగినా, ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా విద్యుత్‌ సిబ్బంది గంటల్లోనే పరిష్కరిస్తున్నారు. ఫలితంగా ఏడాది కాలంలో విద్యుత్‌ అంతరాయాలు 37.44 శాతం మేర తగ్గాయని ఇంధన శాఖ స్పష్టం చేసింది. గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న జూనియర్‌ లైన్‌మెన్లంతా మరింత అప్రమత్తంగా ఉన్నారని తెలిపింది.

తక్షణమే ప్రత్యక్షం
గ్రామ సచివాలయం పరిధిలో జూనియర్‌ లైన్‌మెన్లను విద్యుత్‌ శాఖ నియమించి, అవసరమైన శిక్షణ ఇస్తోంది. భవిష్యత్‌లో వాళ్లు లైన్‌మెన్, సీనియర్‌ లైన్‌మెన్, లైన్‌ ఇన్‌స్పెక్టర్, లైన్‌ సూపర్‌వైజర్, ఫోర్‌మెన్‌గా పదోన్నతులు పొందేలా వ్యవస్థను రూపొందించింది. ప్రతి జూనియర్‌ లైన్‌మెన్‌ 1,500 విద్యుత్‌ కనెక్షన్లకు బాధ్యుడు. 30 నుంచి 40 ట్రాన్స్‌పార్మర్లను ఇతను పర్యవేక్షిస్తుంటాడు. 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో లైన్‌పై చెట్లు పడ్డా, జంపర్లు తెగిపోయినా బాగు చేస్తాడు. కరోనా ఉన్నప్పటికీ భద్రత చర్యలు పాటిస్తూ వారు విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా, చెడిపోయినా కొత్తవి బిగిస్తున్నారు. మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం జూనియర్‌ లైన్‌మెన్‌ విధుల్లో భాగం. కాబట్టి వీరంతా ఫీల్డ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. విద్యుత్‌ సరఫరాకు సంబంధించి ఏ సమస్య గ్రామ సచివాలయానికి వచ్చినా సంబంధిత అధికారులు ఫోన్‌ ద్వారా జూనియర్‌ లైన్‌మెన్‌ను సంప్రదిస్తారు. ఫిర్యాదు వచ్చిన క్షణాల్లో కరెంట్‌ సమస్యలను పరిష్కరించాలి. దీనికి కచ్చితమైన జవాబుదారీతనం ఉంది. 

దారికొచ్చిన అంతరాయాలు
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత విద్యుత్‌ అంతరాయాల్లో గుణాత్మక మార్పు చోటుచేసుకుంది. ఎక్కువ గంటలు కరెంట్‌ పోయిందనే ఫిర్యాదులు క్రమంగా తగ్గుతున్నాయి. సచివాలయాలు ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే ఈ మార్పు ఉందంటే.. భవిష్యత్‌లో మరింత పురోగతి వస్తుంది. 2019లో 6,98,189 విద్యుత్‌ అంతరాయాలపై ఫిర్యాదులొస్తే.. 2020లో వీటి సంఖ్య 4,36,781గా నమోదైంది. అంటే.. దాదాపు 2.60 లక్షల ఫిర్యాదులు తగ్గాయి. గతంలో కరెంట్‌ పోతే ఎక్కడో దూరంగా ఉంటే లైన్‌మెన్‌ రావాలి. ఇప్పుడా సమస్య లేదు. ఊళ్లోనే జూనియర్‌ లైన్‌మెన్‌ అందుబాటులో ఉన్నాడు. అతనికి అన్నివిధాల శిక్షణ కూడా ఇవ్వడంతో విద్యుత్‌ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి. 

మరిన్ని వార్తలు