పల్లెపల్లెన 'ప్రకాశం'.. సంక్షేమ వికాసం

17 Feb, 2021 05:16 IST|Sakshi
ప్రకాశం జిల్లా బి.నిడమానూరు గ్రామం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రంలో విత్తనాలు,ఎరువులు తీసుకెళ్తున్న రైతులు

వడివడిగా ప్రగతి పనులు 

నిండుకుండల్లా జలవనరులు 

పాడిపంటలతో గ్రామాలు కళకళ 

ప్రకాశం జిల్లాలో వలసలు మానిన ప్రజలు  

గతం: జిల్లా పేరులోనే ప్రకాశం. గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం చీకట్లే. కరువు విలయతాండవం చేసేది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఖాళీ అయిన గ్రామాలెన్నో. పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలస వెళ్లినవారు ఎందరో. సాగునీరు దశాబ్దాలకు ఒకసారి అందేది. అభివృద్ధి జాడ కనిపించేది కాదు. ప్రాజెక్టుల పనులు సాగవు. ప్రజలకు సంక్షేమ పథకాలు అంతంతమాత్రంగానే అందేవి. 

వర్తమానం: జిల్లా ప్రకాశిస్తోంది. జలవనరులు కళకళలాడుతున్నాయి. తాగునీరు సమృద్ధిగా ఉంది. గ్రామాల్లో నిరంతరం పనులు లభిస్తున్నాయి. సాగునీరు అందుతోంది. పొలాలు పైర్లతో పచ్చగా కనిపిస్తున్నాయి. ప్రగతి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నాయి. సంక్షేమ పథకాల ఫలాలు ఇంటివద్దకే వస్తున్నాయి. 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్‌సీపీ అధికారం చేపట్టిన తరువాత ప్రకాశం జిల్లాలో గ్రామ స్వరాజ్యం వచ్చింది. జిల్లాలోని 1,038 గ్రామ పంచాయతీల్లో సచివాలయ వ్యవస్థ ఏర్పాటైంది. దీనికితోడు వలంటీర్‌ వ్యవస్థ ఉండటంతో సంక్షేమ పాలన ఇంటిముందుకే వచ్చింది. పింఛన్‌ కోసం వృద్ధులు, వికలాంగులు పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు గాసే పరిస్థితి నుంచి విముక్తి లభించింది. వలంటీర్లు లబ్ధిదారుల చేతికి ఒకటో తేదీనే డబ్బు అందిస్తున్నారు. జిల్లాలో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. బాగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. సాగర్‌ నీళ్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 952 సాగు నీటి చెరువులుండగా 800కు పైగా చెరువులు నిండు కుండల్లా మారాయి. ఆరు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. జిల్లాలో పదిలక్షలకు పైగా ఎకరాల్లో పైర్లు పచ్చగా కనిపిస్తున్నాయి. గ్రామీణులు వలసలు మానుకుని పాడి, పంటలతో సంతోషంగా జీవిస్తున్నారు. వరుణుడి కరుణతో గత సంవత్సరం పండినట్లే ఈ ఏడాది కూడా పంటలు బాగా పండుతాయని అంచనా వేస్తున్నారు. 
యర్రగొండపాలెం మండలం మురారిపల్లెలో నాడు–నేడు డెమో స్కూల్‌  

ప్రతి గ్రామానికి తాగునీరు 
ప్రకాశం జిల్లాలోని అనేక గ్రామాల్లో తాగడానికి గుక్కెడు నీళ్లులేక ఊళ్లకు ఊళ్లు ఖాళీచేసి వలసలు వెళ్లిన దుర్భర పరిస్థితిని గుర్తించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. దీన్లో భాగంగా కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లోని 500 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.833 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం ఈ పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. 

రూపుమారిన పాఠశాలలు 
నాడు–నేడు కింద చేపట్టిన పనులతో జిల్లాలో పాఠశాలలు కొత్తరూపు సంతరించుకున్నాయి. తొలిదశగా 1,387 పాఠశాలల్లో ఈ పనులకు రూ.328.19 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అనేక పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి. రూ.220 కోట్లు వెచ్చించారు. మార్చి నెలాఖరుకు పనులు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తరగతి గదుల్ని తీర్చిదిద్దారు. విద్యార్థులు భోజనాలు చేసేందుకు వసతులు సమకూర్చారు. అనేక పాఠశాలలకు ప్రహరీలు నిర్మించారు. ఆవరణలు పచ్చగా కళకళలాడుతున్నాయి. 

గ్రామాల్లో వేగంగా అభివృద్ధి 
జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణం వడివడిగా సాగుతోంది. తొలివిడతలో 871 గ్రామ సచివాలయాలకు భవనాలు మంజూరయ్యాయి. వీటికి రూ.333 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 877 రైతుభరోసా కేంద్రాల భవనాల నిర్మాణానికి రూ.194 కోట్లు కేటా యించారు. అదేవిధంగా 744 వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి రూ.121 కోట్లు మంజూరు చేశారు. మొత్తం భవనాల్లో 40 శాతానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి.

గ్రామ సచివాలయాల్లో 9,533 మంది సిబ్బంది పనిచేస్తుండగా 19,288 మంది వలంటీర్లు ఒక్కొక్కరు 50 ఇళ్లకు సేవలు అందిస్తున్నారు. బియ్యం, రేషన్‌ సరుకులు లబ్ధిదారుల ఇంటివద్దే పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు.. పథకంలో భాగంగా జిల్లాలో 1.39 లక్షలమందికి ఇంటిస్థల పట్టాలు, ఇల్లు మంజూరు చేస్తున్నారు. ఇప్పటికే అధిక శాతం మందికి పట్టాలు పంపిణీ చేశారు. కోర్టు పరిధిలో ఉన్న వాటికి మాత్రం భరోసా పత్రాలు ఇచ్చారు.  

ప్రభుత్వం పథకాలు ప్రయోజనకరం 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి.  ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6.30 గంటలకు ఇంటికే తెచ్చి డబ్బు చేతిలో పెడుతున్నారు. జనగనన్న కాలనీలో నాకు స్థలం వచ్చింది. ఇంటి ముందే బియ్యం, సరుకులు ఇస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఉండటానికి ఇల్లు, తింటానికి తిండి, నేను బతికేందుకు డబ్బులు అన్ని వస్తున్నాయి.                  
– షేక్‌ షకినాబీ, పంగులూరు 

70 మంది పిల్లలు వస్తున్నారు 
50 కుటుంబాలున్న మా గ్రామంలో 22 మంది బడి ఈడు పిల్లలున్నారు. మాగ్రామంలోని పాఠశాలలో వసతులు ఉండేవి కావు. పిల్లలందరినీ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలకు పంపించేవాళ్లం. నాడు–నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో రూ.30 లక్షలతో వసతులు సమకూర్చారు. ఇప్పుడు మా బడిలో 70 మంది విద్యార్థులున్నారు. పక్కూరు నుంచి కూడా పిల్లలొస్తున్నారు.
 – ఇరగనబోయిన గోపి, విద్యార్థి తండ్రి, చెర్లోపల్లె, రాచర్ల మండలం   

మరిన్ని వార్తలు