93.94 % చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు

4 Oct, 2021 05:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్‌ సమయంలోనూ చిన్నారులకు భారీగా వ్యాక్సినేషన్‌ 

సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌లో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఓ వైపు కోవిడ్‌ ఉన్నా చిన్నారులకు ఇచ్చే టీకాల విషయంలో వైద్యారోగ్య శాఖ రాజీ పడకుండా ప్రతి చిన్నారికీ టీకా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు 93.94 శాతం టీకా వేసినట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా విశాఖ జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 108.90 శాతం వేశారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 76.20 శాతం నమోదైంది. పెంటావాలెంట్‌(ఐదు రకాల వ్యాధులకు ఒకే వ్యాక్సిన్‌) మూడో డోస్‌ను 92.76 శాతం మందికి ఇచ్చారు.

ఓరల్‌ పోలియో(పోలియో చుక్కల మందు)ను మూడో డోస్‌లో 93.15% మందికి ఇచ్చినట్టు గణాంకాలు వెల్లడించాయి. మూడో డోసు పోలియో చుక్కల మందు 3.42 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా.. 3.18 లక్షల మందికి ఇచ్చారు. పుట్టగానే వేసే బీసీజీ వ్యాక్సిన్‌ సెప్టెంబర్‌ చివరి నాటికి 85.55% మందికి, పోలియో చుక్కల జీరో డోసు 80.30% మందికి, హెపటైటిస్‌బి జీరో డోస్‌ వ్యాక్సిన్‌ 75.17 శాతం మందికి వేశారు. హెపటైటిస్‌ వ్యాక్సిన్‌ వేయడంలో 2.56% వృద్ధి కనిపించినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆరోగ్య ఉప కేంద్రం మొదలుకుని బోధనాస్పత్రి వరకు అన్ని ఆస్పత్రుల్లోనూ వ్యాధి నిరోధక టీకాలున్నాయని, ప్రతి ఒక్క తల్లీ తమ బిడ్డకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని కుటుంబ సంక్షేమ శాఖ కోరింది.  

మరిన్ని వార్తలు