బదిలీలు పారదర్శకంగా..

7 Feb, 2022 04:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎన్నడూ లేని విధంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఆన్‌లైన్‌ విధానం అమలు 

ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న అన్ని కేడర్లలో తొలిసారిగా ట్రాన్స్‌ఫర్లు  

నేడు అన్ని విభాగాల్లో ఖాళీల ప్రదర్శన 

ఒక్కో ఉద్యోగికి 20 ప్రాంతాలను ఎంపిక చేసుకునే వెసులుబాటు 

సాక్షి, అమరావతి: ఏళ్ల తరబడి ఒకేచోట పోస్టింగ్‌.. పోస్టింగ్‌ ఒకచోట ఉంటే మరోచోట డిప్యుటేషన్‌.. అర్హతతో సంబంధంలేని విభాగంలో కొలువు, సీటులో ఉంటూ కాలయాపన.. ఇదీ గత కొన్నేళ్లుగా వైద్య, ఆరోగ్య శాఖలో కొందరు ఉద్యోగుల పనితీరు. ఇప్పటికే ఈ శాఖలో సమూల మార్పులు తీసుకొస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తాజాగా బదిలీల విషయంలోను సంస్కరణలకు పూనుకుంది. వైద్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆన్‌లైన్‌ విధానంలో సాధారణ బదిలీలు చేపడుతోంది. ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న అన్ని కేడర్ల శాశ్వత ఉద్యోగులను బదిలీ చేస్తోంది. రాజకీయ సిఫార్సులు, ఆర్థిక లావాదేవీలు పైరవీలకు అవకాశంలేకుండా పారదర్శకంగా బదిలీలు చేసేందుకు ప్రభుత్వం ఈ విధానం ప్రవేశపెట్టింది.  

విధులపట్ల తీవ్ర నిర్లక్ష్యం 
ఇక ఒకేచోట ఏళ్ల తరబడి స్థిరపడిపోవడంతో కొందరు వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై పెట్టిన దృష్టి ప్రభుత్వ విధులపై ఉండడంలేదు. మరికొందరు వైద్యులు ఒకేచోట 10–20 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో వేళ్లూనుకుపోయి విధులకు సరిగా హాజరుకావడంలేదనే ఆరోపణలున్నాయి. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా పలు వైద్య కళాశాలల్లో కొందరు వైద్యులు విధులకు హాజరుకాకపోవడం, గైర్హాజరైనా రిజిస్ట్రర్‌లో సంతకం చేసి విధులకు హాజరైనట్లు చూపించుకోవడం వంటి ఉదంతాలు గత ఏడాది వెలుగుచూశాయి. పీహెచ్‌సీ, ప్రాంతీయ ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలోని కొందరు వైద్యులు కూడా నర్సింగ్‌ హోమ్‌లు, ఆసుపత్రుల్లో ప్రాక్టీస్‌ చేసుకుంటూ విధులకు సరిగ్గా హాజరుకావడంలేదని ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితులన్నింటికీ చెక్‌ పెట్టేందుకే ప్రభుత్వం సాధారణ బదిలీలను చేపడుతోంది. దీనికితోడు వైద్యులు, వైద్య సిబ్బంది కొరతన్న మాటకు తావు లేకుండా భారీగా నియామకాలూ చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 39 వేల పోస్టుల భర్తీ చేపట్టింది. వీటిలో ఇప్పటికే 27 వేల పోస్టుల భర్తీ పూర్తవగా మిగిలిన పోస్టుల భర్తీ ఈనెలాఖరుతో పూర్తికానుంది. 

నేడు ఖాళీల ప్రదర్శన 
మరోవైపు.. ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఆయా విభాగాలు వేగవంతం చేశాయి. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన ఉద్యోగికి తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు, మైదాన ప్రాంతాల్లో మూడేళ్లు పనిచేసిన వారు రిక్వెస్ట్‌ ట్రాన్స్‌ఫర్‌కు అర్హులు. డీఎంఈ పరిధిలో 270 మంది ప్రొఫెసర్లు, 192 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 800 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 70 మంది ట్యూటర్లు ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నారు. ఆన్‌లైన్‌లో వివరాల నమోదు పూర్తికాగా.. సోమవారం ఖాళీలు ప్రదర్శించి, ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకుంటామని డీఎంఈ రాఘవేంద్ర తెలిపారు. మిగిలిన విభాగాల్లో ఉద్యోగుల వివరాల సేకరణ తుదిదశకు చేరింది. రాష్ట్ర, జోనల్, జిల్లా స్థాయిల్లో సోమవారం బదిలీలకు సంబంధించిన ఖాళీల వివరాలను ప్రదర్శిస్తారు.  అనంతరం ఉద్యోగుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఒక్కో ఉద్యోగి 20 ప్రాంతాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజారోగ్యం, ఏపీవీవీపీ, ఇతర విభాగాల్లో ఉద్యోగులు ఆన్‌లైన్‌లో బదిలీ దరఖాస్తులు చేసుకోవడానికి మంగళవారం నుంచి వీలు కల్పించే అవకాశం ఉంది.    

మరిన్ని వార్తలు