AP: రాష్ట్రంలో గ్రానైట్‌ 'మెరుపులు'

24 Aug, 2022 03:28 IST|Sakshi

పరిశ్రమను ఆదుకునేందుకు శ్లాబ్‌ విధానం అమలు

పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ అమలుకు సీఎం జగన్‌ శ్రీకారం

శ్లాబ్‌ విధానం అమలుకు జీవో జారీ 

ఆసక్తి ఉన్న వారు ఈ విధానంలోకి వచ్చే వెసులుబాటు

మూతపడిన పరిశ్రమలకు మళ్లీ మంచిరోజులు

పెరగనున్న ఉపాధి అవకాశాలు

చిన్న సైజు గ్రానైట్‌నూ దేశీయ మార్కెట్లో వినియోగించే అవకాశం

సీనరేజికీ శ్లాబు విధానం అమలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రానైట్‌ పరిశ్రమకు మంచి రోజులు వచ్చాయి. తన పాదయాత్రలో పలు ప్రాంతాల్లో గ్రానైట్‌ పరిశ్రమల నిర్వాహకుల కష్టాలను విన్న వైఎస్‌ జగన్‌ ఆనాడు ఇచ్చిన హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు. ఆర్థిక మాంద్యం, ప్రోత్సాహం లేకపోవడం వంటి కారణాలతో మూతపడిన గ్రానైట్‌ పరిశ్రమలు మళ్ళీ పుంజుకొనేలా శ్లాబ్‌ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రాష్ట్ర గనుల శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రానైట్‌ పరిశ్రమల నిర్వాహకులు శ్లాబ్‌ విధానాన్ని ప్రతిపాదించారు. చిన్న గ్రానైట్‌ పరిశ్రమలకు మేలు చేసేలా శ్లాబ్‌లను నిర్ణయించాలని కోరారు. దానిపై స్పందించిన వైఎస్‌ఆర్‌ 2009లో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. ప్రతి కట్టర్‌కు రూ.14 వేల శ్లాబ్‌ను ఖరారు చేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో ఈ విధానం అమలు కాలేదు. 2016లో అప్పటి ప్రభుత్వం జీవో 97 ద్వారా శ్లాబ్‌ విధానాన్ని ఉపసంహరించుకుంది. ఫలితంగా అప్పటికే ఆర్థిక మాంద్యంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రానైట్‌ కర్మాగారాలు మరింత ఇబ్బందుల్లో పడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 వేల గ్రానైట్‌ కర్మాగారాల్లో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు మూతపడ్డాయి. వీటిపై ఆధారపడిన వేలాది కార్మికులు, రవాణా, మార్కెటింగ్‌ రంగాల వారు ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇదే సమయంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ను పలువురు గ్రానైట్‌ పరిశ్రమల నిర్వాహకులు, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన వారు కలిశారు. వారి కష్టాలను వివరించారు.

గ్రానైట్‌ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్‌ పరిశ్రమలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ ఆమోదయోగ్యమైన శ్లాబ్‌ విధానానికి చర్యలు ప్రారంభించారు. గ్రానైట్‌ పరిశ్రమల నిర్వాహకులతో గనుల శాఖ అధికారులు పలుసార్లు సమావేశమయ్యారు. స్లాబ్‌ విధానం, ప్రయోజనాలు, ఆచరణ యోగ్యమైన విధానాలపై చర్చించారు. ఎవరైతే ఈ విధానం పట్ల ఆసక్తి చూపుతారో, వారు స్వచ్ఛందంగా దీని పరిధిలోకి వచ్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, కోర్టు తుది తీర్పుకు లోబడి ఈ విధానం అమలవుతుందని జీవోలో పేర్కొన్నారు.

సీనరేజికీ శ్లాబు విధానం
స్టోన్‌ కటింగ్, క్వాలిటీ పరిశ్రమల్లో గ్రానైట్‌ బ్లాకులపై వసూలు చేసే సీనరేజి ఫీజుకు కూడా ప్రభుత్వం శ్లాబ్‌ విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ప్రకాశం జిల్లాలో సింగిల్‌ బ్లేడ్‌కి రూ.27 వేలు, మల్టీ బ్లేడ్‌కి రూ.54 వేలు రేటుగా నిర్ణయించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సింగిల్‌ బ్లేడ్‌కు రూ.22 వేలు, మల్టీ బ్లేడ్‌కు రూ.44 వేలు రేటుగా నిర్ణయించింది. 

తిరిగి తెరుచుకోనున్న పరిశ్రమలు
ఇప్పటికే మూతపడిన పరిశ్రమలు శ్లాబ్‌ విధానంతో తిరిగి తెరుచుకుంటాయి. అంతే కాదు.. ఎక్స్‌పోర్ట్‌ క్వాలిటీ కాకుండా రెండో రకంతో ఉన్న చిన్న సైజ్‌ గ్రానైట్‌ బ్లాక్‌లను కూడా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటివరకు వృధాగా వదిలేస్తున్న ఈ ఖనిజాన్ని కూడా దేశీయ అవసరాలకు అనుగుణంగా చిన్న సైజుల్లో తయారుచేసి, మార్కెట్‌ చేసుకోవచ్చు. దీనివల్ల దేశీయ మార్కెట్‌లో అన్ని వర్గాల వారికి వారి అవసరాలకు అనుగుణమైన గ్రానైట్‌ పలకలను అందించే వెసులుబాటు కలుగుతుంది. మరోవైపు గ్రానైట్‌ పరిశ్రమలు ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో గ్రానైట్, కట్టింగ్, పాలిషింగ్, రవాణా, మార్కెటింగ్‌ రంగాల్లో పెద్ద ఎత్తున స్థానికులకు ఉపాధి లభిస్తుంది. 

మరిన్ని వార్తలు