చిన్న కమతాలకు పెద్ద అండ యాంత్రీకరణ

9 Nov, 2020 03:34 IST|Sakshi

కూలీల కొరతను ఎదుర్కొనే మార్గం

ఆకట్టుకున్న వ్యవసాయ పరికరాల ప్రదర్శన

సాక్షి, అమరావతి: పవర్‌ టిల్లర్లు, వీడర్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, కట్టె గానుగలు వంటి అనేక చిన్నా, పెద్ద యంత్రాల ప్రదర్శనకు గుంటూరు సమీపంలోని పుల్లడిగుంట వేదికైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్‌ ఆదివారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు వందలాదిమంది రైతులు హాజరయ్యారు. పరికరాల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చూసి, చేసి తెలుసుకున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల డీన్, అగ్రికల్చర్‌ ప్రొఫెసర్‌ జోసఫ్‌రెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రకృతి, సేంద్రియరంగ సేద్య నిపుణులు రైతులకు యంత్రపరికరాల వినియోగ అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో కమతాలు చిన్నవైనందున వాటికి తగిన యంత్రాలనే ఇక్కడ ప్రదర్శనకు పెట్టామని రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ వై.వెంకటేశ్వరరావు చెప్పారు. 

ఆకట్టుకున్న ప్రదర్శన
పత్తి, మిరప వంటి పంటల్లో కలుపు తీసే యంత్రాలు, ట్రాక్టర్‌ సాయంతో పెద్దఎత్తున పిచికారీ చేసే పరికరాలు, తక్కువ ఖర్చుతో 10, 12 కిలోల కూరగాయలు నిల్వచేసుకునే థర్మోకోల్‌ రిఫ్రిజిరేటర్లు, అంతరసేద్యం చేసే బుల్లి గొర్రు, చిన్న నాగలి, మనిషి నిల్చొనే గడ్డి పీకేసే పరికరాలు వంటివి అనేకం రైతులను ఆకట్టుకున్నాయి. పలువురు వ్యవసాయ విద్యార్థులు సొంతంగా తయారుచేసిన పరికరాలను రైతులు ఆసక్తిగా పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. 

ఈ రైతు పేరు పి.సాంబశివరావు. గుంటూరు జిల్లా  పసుమర్రు గ్రామం. తన మోపెడ్‌ వాహనాన్నే సోలార్‌ పవర్‌ స్ప్రేయర్‌గా మార్చుకున్నారు. ఎక్కడైనా చేలో మందు చల్లాల్సి వచ్చినప్పుడు మోపెడ్‌కు బిగించిన 20 లీటర్ల క్యాన్‌లో ద్రావణాలను కలిపి సోలార్‌ పవర్‌ ఆధారంగా నడిచే చిన్న మోటారు సాయంతో పిచికారీ చేస్తున్నారు. మోపెడ్‌ మీదనే పొలానికి వెళతారు. చేలో బండి ఆపి మందును పిచికారీ చేస్తారు. 

మీ పంట చేలో పడిన కోతులను తరమడం పెద్ద బెడదగా మారిందా? అయితే ఇదిగో పరిష్కారం. తక్కువ ఖర్చుతో పెద్ద శబ్దం వచ్చే చిన్నపాటి ప్లాస్టిక్‌ గన్‌ను ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. దీన్ని ఎలా వాడాలో రైతులకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఇదో పవర్‌ టిల్లర్‌. ఎద్దులు, దున్నపోతులతో పనిలేకుండా స్వయంగా రైతే పొలాన్ని దున్నుకునే చిన్నపాటి యంత్రం. దీనిసాయంతో ఎకరం, రెండెకరాల పొలాన్ని సునాయాసనంగా దున్నవచ్చు. లీటర్‌ పెట్రోలు పోసుకుంటే గంటన్నరకుపైగా నడుస్తుంది. తక్కువ ఖర్చుతో అటు సమయాన్ని, ఇటు శ్రమను ఆదా చేసుకోవచ్చు.  

మరిన్ని వార్తలు