జాతీయ సదస్సులో ఆకట్టుకున్న సర్పంచ్‌ ప్రసంగం 

13 Apr, 2022 04:58 IST|Sakshi
మాట్లాడుతున్న శీలం రంగారావు

ఏపీలో సమర్థవంతంగా అమలవుతున్న సుపరిపాలనపై సుదీర్ఘ ఉపన్యాసం 

నిడమానూరు సర్పంచ్‌ శీలంను అభినందించిన పలువురు ప్రముఖులు  

రామవరప్పాడు: ‘సుపరిపాలన’ అంశంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరు సర్పంచ్‌ శీలం రంగారావు ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో  ‘సుపరిపాలన’ అంశంపై జాతీయ సదస్సు జరుగుతున్న విషయం విదితమే.

ఈ జాతీయ సదస్సులో రంగారావు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవంతంగా అమలు చేస్తున్న నవరత్న పథకాలు, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తీరు, సంక్షేమ పథకాలు, పరిపాలన విధానం, సచివాలయ వ్యవస్థపై విపులంగా వివరించారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు దాదాపు 640కిపైగా పౌరసేవలను సీఎం జగన్‌ అందిస్తున్నారని చెప్పారు. నాడు–నేడు పథకం ద్వారా శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు, వైద్యశాలలకు కొత్తరూపు తీసుకొచ్చారని తెలిపారు.

రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట్, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్‌ ఆసరా, చేయూత, పింఛన్ల పెంపు, అమ్మ ఒడి, రైతు భరోసా, జలయజ్ఞం తదితర పథకాల అమలు తీరును స్పష్టంగా వివరించారు. సదస్సులో మినిస్ట్రీ ఆఫ్‌ పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉమా మహదేవన్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు