కోర్టు ధిక్కార కేసులో.. పలువురు ఐఏఎస్‌లకు జైలుశిక్ష 

3 Sep, 2021 03:52 IST|Sakshi

మన్మోహన్‌సింగ్‌కు, రావత్‌కు నెల రోజులు.. ముత్యాలరాజుకు రెండు వారాలు.. శేషగిరిబాబు, చక్రధర్‌లకు జరిమానా 

రాష్ట్ర హైకోర్టు తీర్పు  

అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా తీర్పు అమలు నాలుగు వారాలపాటు నిలుపుదల 

సాక్షి, అమరావతి: 2015 నాటి భూసేకరణకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కార కేసులో పలువురు ఐఏఎస్‌ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌కు నాలుగు వారాల జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా.. ప్రస్తుత ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్‌ రావత్‌కి నెలరోజుల జైలు, రూ.2వేల జరిమానా..  అప్పటి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజుకు రెండు వారాల జైలుశిక్ష, రూ.1000 జరిమానా.. అప్పటి మరో కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, ప్రస్తుత కలెక్టర్‌ ఎన్‌వీ చక్రధర్‌లకు రూ.2వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం తీర్పు వెలువరించారు. అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా న్యాయమూర్తి తన తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలుపుదల చేశారు.  

కేసు పూర్వాపరాలివీ.. 
నెల్లూరు జిల్లాలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌ కోసం భూమిని కేటాయించాలని ఆ సంస్థ డైరెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ను కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ పదెకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం, ఎర్రగుంటకు చెందిన తాళ్లపాక సావిత్రికి అదే మండలం కనుపూరు బిట్‌–2లో ఉన్న మూడెకరాలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం.. ఆ భూమిని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌ డైరెక్టర్‌కు స్వాధీనం చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులిచ్చారు. అయితే, సావిత్రమ్మకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. దీంతో ఆమె 2017లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, ఆమెకు పరిహారం ఇవ్వాలంటూ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. అయితే.. హైకోర్టు ఆదేశించినా అధికారులు ఎలాంటి పరిహారం ఇవ్వకపోవడంతో సావిత్రమ్మ 2018లో కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇందులో నాటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మన్మోహన్‌ సింగ్, ప్రస్తుత ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్, అప్పటి సీసీఎల్‌ఏ అనిల్‌ పునేఠా, జిల్లా కలెక్టర్లు ముత్యాలరాజు, ఇంతియాజ్, చక్రధర్, ఆర్‌డీఓ హరిత, తహసీల్దార్‌ సోమ్లా బాణావత్‌ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులందరినీ ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు కౌంటర్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ ముందుకు విచారణకు రాగా.. ఆయన అధికారులందరి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు.

చివరకు ఈ ఏడాది మార్చి 3న పరిహారం మొత్తాన్ని సావిత్రమ్మ బ్యాంకు ఖాతాలో జమచేశారు. అందరి కౌంటర్లు పరిశీలించిన న్యాయమూర్తి, కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన నాలుగేళ్ల తర్వాత అధికారులు పరిహారం మొత్తాన్ని పిటిషనర్‌ ఖాతాలో జమచేశారన్నారు. కోర్టు ధిక్కారం కింద అధికారులను శిక్షించేందుకు ఇది తగిన కేసని తెలిపారు. పరిహారం చెల్లింపులో జరిగిన జాప్యానికి రెవెన్యూ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, అప్పటి, ప్రస్తుత కలెక్టర్లే బాధ్యులని తేల్చారు. వారికి జైలుశిక్ష, జరిమానా విధించి మిగిలిన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు మూసివేశారు. సావిత్రమ్మను ఇబ్బందిపెట్టినందుకు  ఆమెకు ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ఆదేశించారు. ఈ మొత్తాన్ని బాధ్యులైన అధికారుల నుంచి వసూలుచేయాలని  ప్రభుత్వాన్ని ఆదేశించారు.   

>
మరిన్ని వార్తలు