రికవరీ రేటు: 84 శాతంతో జిల్లా మొదటి స్థానం..

1 Sep, 2020 20:55 IST|Sakshi

సాక్షి, కృష్ణా : రాష్టంలోనే బెస్ట్ కోవిడ్ సెంటర్‌గా పెదఅవుటుపల్లిలో ఉన్నజిల్లా కోవిడ్ సెంటర్‌ను ప్రభుత్వం గుర్తించిందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ అన్నారు.  గన్నవరం నియోజకవర్గంలోని పలు కోవిడ్‌ కేర్ సెంటర్‌లను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ సందర్శించారు. ఆయనతోపాటు రాష్ట్ర హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కేఎస్‌ జవహర్ రెడ్డి, కమిషనర్ భాస్కర్, జాయింట్  కలెక్టర్ శివ శంకర్, సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ కూడా ఉన్నారు. పెదఅవుటుపల్లి ,గూడవల్లిలోని ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లతో పాటు స్టేట్ కోవిడ్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్‌.. కోవిడ్ బాధితులకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. (ఏపీలో కొత్తగా 10,368 కరోనా కేసులు)

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెదఅవుటుపల్లిలో ఉన్న పిన్నమనేని కళాశాలను డిస్టిక్ కోవిడ్ సెంటర్‌గా వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడ 300 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, 2600 మంది ఈ సెంటర్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక్కడ ఉన్న హెల్ప్ డెస్క్‌తో పాటు పేషేంట్‌లకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నామని వెల్లడించారు. 16 సీసీ కెమెరాలతో ఇక్కడ శానిటేషన్  చర్యలు, మెడికల్ ఫెసిలీటీస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. జిల్లాలో కోవిడ్‌ను జిల్లాలో  కట్టడి చేస్తున్నామన్నారు. రికవరీ రేటు రాష్ట్ర సగటు74 శాతం ఉంటే జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో ఎక్కువ  కరోనా పరీక్షలు సైతం చేస్తున్నామని వెల్లడించారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్, శానిటైజర్‌లను ప్రజలు వినియోగించడం ద్వారానే కరోనా కట్టడి సాధ్యం అయ్యిందన్నారు. (అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి)

మరిన్ని వార్తలు