పవర్‌'ఫుల్'‌

1 Mar, 2021 04:36 IST|Sakshi

గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగంలో పెరుగుదల 

రోజుకు 208 మిలియన్‌ యూనిట్లకు చేరిక 

సాక్షి, అమరావతి: వేసవి సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. గత ఏడాది రికార్డులను బద్దలు కొడుతోంది. వారం రోజులుగా నిత్యం కనీసం 5 మిలియన్‌ యూనిట్ల (ఎంయూల) వరకూ అదనంగా డిమాండ్‌ ఏర్పడుతోంది. ఫలితంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ఏపీ జెన్‌కో ఉత్పత్తి చేసే విద్యుత్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. జెన్‌కో సైతం మునుపెన్నడూ లేనివిధంగా గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. వేసవి ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మండు వేసవిలో వాడకం పెద్దఎత్తున పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. తాజా పరిస్థితిని రాష్ట్ర విద్యుత్‌ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఆదివారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

రోజుకు 208 మిలియన్‌ యూనిట్లు 
వారం క్రితం రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజుకు 168 ఎంయూలు ఉంది. బుధవారం నాటికి అదికాస్తా 175 ఎంయూలకు చేరింది. శనివారం ఏకంగా 208 ఎంయూల గరిష్ట వినియోగం రికార్డయింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థాయిలో డిమాండ్‌ పెరగడం ఇదే మొదటిసారి. గత ఏడాది మార్చిలో రోజుకు గరిష్టంగా 206 ఎంయూల డిమాండ్‌ నమోదైంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే విశాఖ, విజయవాడ నగరాల్లో విద్యుత్‌ వినియోగం మరింత అధికంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 220 ఎంయూల వరకూ వెళ్లే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డీసీ) అంచనా వేస్తోంది.  

పెరుగుదలకు ఇవీ కారణాలు 
► ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఒక్కసారిగా పెరిగింది.  
► పారిశ్రామిక రంగంలో మార్చి నెలాఖరుకు వార్షిక సంవత్సరం ముగుస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి లక్ష్యాలను దాటేందుకు కొన్ని పరిశ్రమలు ఎక్కువ స్థాయిలో పని చేస్తున్నాయి. దీంతో పారిశ్రామిక విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. 
► రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పగటి పూటే 9 గంటల విద్యుత్‌ ఇస్తోంది. రబీ సీజన్‌ కావడంతో పగటి విద్యుత్‌ వినియోగం పెరిగింది. రోజుకు 28 ఎంయూల వరకూ ఉండే 
వ్యవసాయ విద్యుత్‌ వినియోగం 33 ఎంయూలకు చేరినట్టు చెబుతున్నారు.  

జెన్‌కో రికార్డు బ్రేక్‌ 
డిమాండ్‌కు తగ్గట్టే ఏపీ జెన్‌కో ఉత్పత్తిలో రికార్డు బద్దలు కొట్టింది. ఫిబ్రవరి 27న 103 మిలియన్‌ యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఇందులో 93 ఎంయూలు థర్మల్, 10 ఎంయూల జల విద్యుత్‌ ఉంది. గతంలో జెన్‌కో గరిష్టంగా 80 ఎంయూల ఉత్పత్తి దాటలేదు. బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు యూనిట్‌కు రూ.8 పైనే ఉన్నాయి. దీంతో విద్యుత్‌ పంపిణీ సంస్థలు జెన్‌కోపైనే ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఏపీ జెన్‌కో వేసవికి ముందే యంత్రాలకు అవసరమైన మరమ్మతులు చేయించింది. పెద్దఎత్తున బొగ్గు నిల్వలను సిద్ధం చేసుకుంది. ఎంత డిమాండ్‌ పెరిగినా విద్యుత్‌ కోతలు రానివ్వబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.     

మరిన్ని వార్తలు