ప్రభుత్వ పాఠశాలల్లో అంచనాలకు మించి ప్రవేశాలు

11 Jul, 2021 03:11 IST|Sakshi

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు వెల్లడి

సాక్షి, పద్మనాభం(భీమిలి): ప్రభుత్వ పాఠశాలల్లో అంచనాలకు మించి ప్రవేశాలు జరుగుతున్నాయని విద్యా శాఖ రాష్ట్ర కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు వెల్లడించారు. మండలంలోని మద్దిలో నాడు–నేడు ద్వారా రూ.42 లక్షలతో అభివృద్ధి చేసిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రూ.18.17లక్షలతో అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014–15లో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల మంది పిల్లలుంటే, 2018–19కు 37 లక్షలకు తగ్గినట్టు చెప్పారు.

నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు జగనన్న విద్యా కానుక పంపిణీ చేయడంతో 2019–20లో 6.20 లక్షల మంది అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్టు వివరించారు. ఆట స్థలాల్లేని ప్రభుత్వ పాఠశాలలకు స్థలాలు కొనిచ్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విద్యా కానుకలతో మూడు జతల యూనిఫామ్‌కు అదనంగా స్పోర్ట్స్‌ డ్రెస్, వైట్‌ షూ ఇచ్చే యోచనలో సీఎం ఉన్నట్టు తెలిపారు. మద్దిలో ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రం ఒకే ప్రాంగణంలో ఉన్నందున.. దీనిని జాతీయ విద్యా విధానంలో అకడమిక్‌ డెమో స్కూల్‌గా మార్చనున్నట్లు చినవీరభద్రుడు వివరించారు. 

మరిన్ని వార్తలు