ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన బొగ్గు నిల్వలు

27 Oct, 2021 04:42 IST|Sakshi

మూడు ప్రధాన థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 1,64,100 మెట్రిక్‌ టన్నుల బొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తి

రాష్ట్ర విద్యుత్‌ అవసరాలకు జెన్‌కో భాగస్వామ్యం 36 శాతం

దేశంలో 135 థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు కొరత ఎదుర్కొంటున్న 93 కేంద్రాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు మెరుగుపడ్డాయి. దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 52,800 మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఇది నాలుగు రోజుల ఉత్పత్తికి సరిపోతుంది. డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో ఉన్న 35,300 మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఒక రోజుకే సరిపోతున్నప్పటికీ.. రాయలసీమ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 76 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉండటంతో ఇక్కడ ఐదు రోజులపాటు విద్యుత్‌ ఉత్పత్తి ఆటంకం లేకుండా జరపవచ్చు.

ప్రతిరోజూ దాదాపు 22 ర్యాకుల బొగ్గు రాష్ట్రానికి వస్తుండగా.. మరికొంత నిల్వలు జత చేరుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత చాలావరకూ తగ్గినట్టేనని ఏపీ జెన్‌కో అధికారులు చెబుతున్నారు. విదేశాల నుంచి, ఇతర మార్గాల్లో భవిష్యత్‌ అవసరాల కోసం దాదాపు 10 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు నిల్వలను సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నామని, త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని వెల్లడించారు. 

ఏపీ జెన్‌కో భాగస్వామ్యం 36 శాతం
2020–21 ఆర్థిక సంవత్సరంలో గ్రిడ్‌ వినియోగం 62,080 మిలియన్‌ యూనిట్లు. అంటే రోజుకి సగటున 170 మిలియన్‌ యూనిట్లు. ఇందులో ఏపీ జెన్‌కో 35 శాతం విద్యుత్‌ను అందించింది. ప్రస్తుత 2021–22 ఆర్థిక సంవత్సరంలో 71,252 మిలియన్‌ యూనిట్ల గ్రిడ్‌ డిమాండ్‌ ఉంటుందని ఇంధన శాఖ అంచనా వేసింది. ఇది రోజువారీగా చూస్తే సగటున 195 మిలియన్‌ యూనిట్లు. ఇందులో గత సెప్టెంబర్‌ వరకూ ఏపీ జెన్‌కో 90 మిలియన్‌ యూనిట్లు (46 శాతం) సమకూర్చేది.  తరువాత బొగ్గు కొరత ఏర్పడి థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు ఇబ్బందులు తలెత్తడంతో జెన్‌కో భాగస్వామ్యం తగ్గింది. ప్రస్తుతం 36 శాతం విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు ఏపీ జెన్‌కో అందించగలుగుతోందని ఇంధన శాఖ వర్గాలు వెల్లడించాయి.

దేశంలోనూ మెరుగుపడుతోంది
బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా మూతపడ్డ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు క్రమంగా తెరుచుకుంటున్నాయి. విద్యుత్‌ ఉత్పతి రంగాలకు మినహా ఇతర అవసరాలకు ఇప్పటికే బొగ్గు సరఫరా నిలిపివేసిన కేంద్రం, పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవడంతో ఇంకా సరఫరా పునరుద్ధరించలేదు. మరోవైపు కోల్‌ ఇండియా లిమిడెడ్‌ ఆధ్వర్యంలోనే దేశవ్యాప్తంగా బొగ్గు సరఫరా మొదలుపెట్టడంతో పాటు విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖల కేంద్ర మంత్రులు స్వయంగా ప్రతిరోజూ థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కేటాయింపులు జరుపుతున్నారు. మొత్తం 135 థర్మల్‌ కేంద్రాల్లో 93 కేంద్రాలు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి.

వీటిలో 14 కేంద్రాల్లో ఒక రోజు, 23 కేంద్రాల్లో రెండు రోజులు, 15 కేంద్రాల్లో 3 రోజులు, 16 కేంద్రాల్లో 4 రోజులు, 12 కేంద్రాల్లో 5 రోజులు, 12 కేంద్రాల్లో 6 రోజులు, ఒక కేంద్రంలో 7 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. 8 కేంద్రాలు ఇప్పటికీ మూతపడే ఉన్నాయి. అన్ని కేంద్రాలకు ఎంతోకొంత బొగ్గు అందించేలా కేంద్ర విద్యుత్, బొగ్గు, రైల్వే శాఖ మంత్రులు నేరుగా పంపకాలు చేపడుతున్నట్టు ఇంధన శాఖ అధికారులు చెబుతున్నారు.

సొంత బొగ్గు గనులున్న 16 కేంద్రాల్లో ప్రస్తుతానికి 6 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వీటినుంచే ఇతర కేంద్రాలకు సర్దుబాటు చేస్తుండటంతో ఎక్కడా ఆరేడు రోజులకు మించి నిల్వలు ఉండటం లేదు. గతంలో కనీసం 15 రోజులకు సరిపడా బొగ్గు దిగుమతి చేసుకుని నిల్వ ఉంచే థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు ప్రస్తుతం ఆ అవకాశాన్ని కేంద్రం ఇవ్వడం లేదు. ఏడు రోజులకు మించి ఎక్కడైనా నిల్వలు ఉంటే వాటిని ఇతర ప్లాంట్లకు మంత్రుల సూచనలతో అధికారులు తరలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు