చింతపల్లి @ 5.6 డిగ్రీలు

19 Dec, 2021 05:41 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రంలో పెరిగిన చలి తీవ్రత 

సాక్షి, అమరావతి/సాక్షి విశాఖపట్నం: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. అన్ని ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సగటున 2 నుంచి 4 డిగ్రీల మేర పడిపోయాయి. ఈ సమయంలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 22 డిగ్రీల వరకూ నమోదవుతుంటాయి. తక్కువ ఎత్తులో వీస్తున్న ఈశాన్య గాలులు, సముద్ర మట్టానికి 18 కి.మీ. ఎత్తులో వీస్తున్న ఉత్తర గాలుల వల్ల చలి తీవ్రత పెరిగినట్టు వాతావరణ శాఖాధికారులు చెప్పారు.

రానున్న వారం రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని, 15 రోజుల పాటు దీని ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. విశాఖ మన్యంలో వారం రోజులుగా అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం చింతపల్లిలో అత్యల్పంగా 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.  

మరిన్ని వార్తలు