పరపతి పెంచిన నమ్మకం

14 Jun, 2021 03:43 IST|Sakshi

ప్రభుత్వం, రైతుల పట్ల బ్యాంకులకు పెరిగిన విశ్వాసం 

గత ఆర్థిక ఏడాది లక్ష్యానికి మించి వ్యవసాయ రుణాలు

ఈ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.1,48,500 కోట్లు

మొత్తం ఈ ఆర్థిక ఏడాది వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380 కోట్లు

నేడు సీఎం జగన్‌ అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీ

వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి    

సాక్షి, అమరావతి: ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు.. రెండు సంస్థల మధ్య కావచ్చు.. పరస్పరం నమ్మకం కుదిరినప్పుడే లక్ష్యం మేరకు ఫలితాలు సాధ్యమవుతాయి. ఇదే నమ్మకం వివిధ రంగాలకు.. వ్యవస్థల పట్ల కూడా ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. అది లేకపోతే అనుకున్న మేరకు లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదు. గత చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థల పట్ల విశ్వాసం సన్నగిల్లడంతో ప్రధానంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రైతులకు రుణ మాఫీ చేస్తానని మాట తప్పారు. రైతులకు, మహిళా సంఘాలకు సున్నా వడ్డీకి మంగళం పాడారు. దీంతో అటు రైతులు, ఇటు మహిళా సంఘాలకు బ్యాంకులు రుణాల మంజూరును లక్ష్యం మేరకు అదించలేదు. రెండేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో రైతుల పట్ల బ్యాంకులకు విశ్వాసం పెరిగింది. ఇచ్చిన మాటకు ముఖ్యమంత్రి జగన్‌ కట్టుబడి ఉంటారని బ్యాంకులకు నమ్మకం కలిగింది. దీంతో రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో విరివిగా రుణాలు మంజూరు చేశాయి. గత ఆర్థిక ఏడాది (2020–21)లో వ్యవసాయ రంగానికి లక్ష్యానికి మించి.. అంటే 114 శాతం మేర రుణాలను మంజూరు చేశాయి.

వ్యవసాయ రంగానికి గత ఆర్థిక ఏడాది 1,28,660 కోట్ల రూపాయలు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా, ఏకంగా 1,46,879 కోట్ల రూపాయలు మంజూరు చేశాయి. రైతులు  సకాలంలో రుణాలు చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం సున్నా వడ్డీని అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుండంతో బ్యాంకులు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లోని పథకాలన్నింటికీ కూడా బ్యాంకుల ద్వారానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక ఏడాది (2021–22)లో వ్యవసాయ రంగానికి 1,48,500 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ లక్ష్యంగా నిర్దేశించింది. మొత్తం ఈ ఆర్థిక ఏడాది వార్షిక రుణ ప్రణాళిక 2,83,380 కోట్ల రూపాయలుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఈ ఆర్థిక ఏడాది వార్షిక రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేయనున్నారు.  

మరిన్ని వార్తలు