స్వదేశీ పర్యాటకానికే మొగ్గు

5 Jun, 2022 04:23 IST|Sakshi

కోవిడ్‌ తర్వాత పెరిగిన డిమాండ్‌

ఈ వేసవిలో 94% మంది ప్రయాణం

బీచ్‌ పర్యాటకంలో గోవా, అండమాన్, కేరళకు డిమాండ్‌

స్విట్జర్లాండ్, స్కాట్‌లాండ్, అలస్కాకు బదులు గుల్‌మార్గ్, కూర్గ్, అలి ఎంపిక  

ఓయో మిడ్‌ సమ్మర్‌ వెకేషన్‌ ఇండెక్స్‌ 2022లో వెల్లడి

సాక్షి, అమరావతి: కోవిడ్‌ తర్వాత దేశీయ పర్యాటకుల ఆలోచనలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నది. వేసవి పర్యాటకం అనగానే విదేశాలు ఎగిరిపోయే పర్యాటకులు ఈసారి స్వదేశీ పర్యాటకానికే మొగ్గు చూపారు. మొత్తం పర్యాటకుల్లో 94 శాతం మంది విదేశాల కంటే దేశంలోని చల్లటి ప్రదేశాలకు వెళ్లడానికే మొగ్గు చూపినట్లు ఓయో మిడ్‌ సమ్మర్‌ వెకేషన్‌ ఇండెక్స్‌ 2022 వెల్లడించింది.

గతేడాది డిసెంబర్‌ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ పర్యాటకులు విదేశీ ప్రయాణాలకు అంతగా ఇష్టపడడం లేదన్న విషయం ఆ సర్వేలో వెల్లడయ్యింది. స్విట్జర్లాండ్‌ వెళ్లాలనుకున్న వారిలో 58 శాతం మంది ఈ సారి జమ్ము అండ్‌ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు వెళ్లారు. అలాగే స్కాట్‌లాండ్‌కు వెళ్లాలనుకునేవారిలో 78 శాతం మంది కర్ణాటకలోని కూర్గ్‌కు పయనమయ్యారు.

అదేవిధంగా అమెరికాలోని అలస్కాకు వెళ్లాలనుకునేవారిలో 67.9 శాతం మంది ఉత్తరాఖండ్‌లోని అలిని ఎంచుకున్నారు. వీటితోపాటు కులు, మనాలి, రిషికేష్, ఊటీ, సిక్కిం, అలెప్పీ, జిమ్‌ కార్బెట్‌ (ఉత్తరాఖండ్‌) వెళ్లడానికి అత్యధికంగా మొగ్గు చూపారు.  

బీచ్‌ అంటే గోవానే.. 
వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి బీచ్‌లకు వెళ్లాలనుకునేవారిలో అత్యధికమంది గోవాకే మొగ్గు చూపినట్లు వెల్లడయ్యింది. ఆ తర్వాతి స్థానంలో అండమాన్‌ నికోబార్, కేరళ బీచ్‌లున్నాయి. వాస్తవంగా వేసవిలో బీచ్‌ టూరిజం అంటే ముందుగా గుర్తుకొచ్చేది మాల్దీవులు. ఆ తర్వాతి స్థానాల్లో దుబాయ్, థాయ్‌లాండ్, అమెరికా బీచ్‌లున్నాయి.

అలాగే కోవిడ్‌ భయంతో పర్యాటక రోజులను గణనీయంగా తగ్గించుకున్నారు. ఈ వేసవిలో 55 శాతం మంది తమ పర్యాటకాన్ని మూడు రోజుల్లోనే ముగించుకున్నారు. కొంతకాలంగా పర్యాటకుల ఆలోచనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని, వారాంతాల్లో అప్పటికప్పుడు దేశంలోని ప్రకృతి ప్రాంతాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నారని ఓయో చీఫ్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ శ్రీరంగ్‌ పేర్కొన్నారు. కాగా, మన భారతీయులు సగటు పర్యాటక వ్యయాన్ని రూ.10,000లోపు పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది.  

మరిన్ని వార్తలు