కడలి వైపు పరుగులు

14 Sep, 2020 03:46 IST|Sakshi
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు

కృష్ణా, గోదావరి, వంశధార నదుల్లో పెరిగిన ప్రవాహ ఉధృతి

సాక్షి, అమరావతి/విజయవాడ: వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి, వంశధార నదుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తి 1,18,730 క్యూసెక్కుల కృష్ణా జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఉరకలు వేస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి 1,80,112 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. గొట్టా బ్యారేజీ నుంచి 3 వేల క్యూసెక్కుల వంశధార జలాలను కడలిలోకి విడుదల చేస్తున్నారు.

► కృష్ణా, దాని ఉప నదులైన తుంగభద్ర, భీమా పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,35,374 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే గేట్లు, కుడి విద్యుత్‌ కేంద్రం ద్వారా 1.14 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. 
► నాగార్జున సాగర్‌లోకి 99,972 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌ కేంద్రం, ఎడమ, కుడి కాలువలు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు తరలిస్తున్నారు. సాగర్‌లో 589.80 అడుగుల్లో 311.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 98,030 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్‌ వే గేట్లను ఎత్తేసి 1,12,308 క్యూసెక్కులను దిగువకు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 174.83 అడుగుల్లో 45.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి 1,20,976 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,18,730 క్యూసెక్కులను కడలిలోకివిడుదల చేస్తున్నారు.
► సోమశిల ప్రాజెక్టులోకి 23,503 క్యూసెక్కులు చేరుతుండగా.. 10,216 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సోమశిలలో 57.34 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇక కండలేరు జలాశయంలో నీటి నిల్వ 35 టీఎంసీలకు చేరుకుంది.

>
మరిన్ని వార్తలు