తుంగభద్ర డ్యామ్‌కు పెరిగిన వరద

23 May, 2022 04:18 IST|Sakshi

89,664 క్యూసెక్కుల ప్రవాహ జలాలు రాక

32 టీఎంసీలకు పైగా నీటి నిల్వ

హొళగుంద (కర్నూలు): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి ప్రాజెక్ట్‌ అయిన తుంగభద్ర డ్యామ్‌లో ఇన్‌ఫ్లో ఆదివారం మరింత మెరుగు పడింది.  శనివారం 72,592 క్యూసెక్కులుగా ఉన్న ప్రవాహ జలాలు ఆదివారం 89,664 క్యూసెక్కులకు పెరిగాయి. తుంగభద్ర రిజర్వాయర్‌ పూర్తి నీటిమట్టం 1,633 అడుగులు కాగా.. ఆదివారం ఉదయం 8 గంటలకు 1,605.56 అడుగులుగా నమోదైంది.

100.855 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 27.481 టీఎంసీలుండగా సాయంత్రానికి 32 టీఎంసీలకు పైగా నీరు నిల్వ అయ్యాయి. అందులో 255 క్యూసెక్కులను రాయబసవన కెనాల్‌కు వదులుతున్నారు. గతేడాది ఇదే సమయానికి 1,585.77 అడుగులతో 7.033 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఉపరితల ద్రోణి, అకాల వర్షాల కారణంగా డ్యామ్‌ ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, ఆగుంబే, శృంగేరి, చిక్‌మగళూరు, వరనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇన్‌ఫ్లో బాగా పెరిగింది. 

మరిన్ని వార్తలు