శ్రీశైలం, సాగర్‌ గేట్లు మళ్లీ ఎత్తివేత

25 Aug, 2022 04:04 IST|Sakshi
సాగర్‌ నుంచి విడుదలవుతున్న నీరు

కృష్ణా, తుంగభద్రలో పెరిగిన వరద 

సాక్షి, అమరావతి/విజయపురిసౌత్‌: ఎగువన విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల రేడియల్‌ క్రస్ట్‌ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. జూరాల, సుంకేసుల నుంచి 1,26,428 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం 3 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్‌ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్‌ జలాశయానికి 99,064 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలో 589.40 (310.2522టీఎంసీలు) అడుగులకు చేరడంతో  బుధవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు 4 రేడియల్‌ క్రస్ట్‌గేట్లు, 8 గంటలకు 6 గేట్లు 5 అడుగులు ఎత్తి 48,222 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదనతో కలిసి సాగర్‌ వద్ద నదిలోకి 84,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు 312.0450 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

ప్రకాశం బ్యారేజీలోకి సాయంత్రం 6 గంటలకు 18,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 15,847 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,220 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,35,132 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,15,664 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.   

మరిన్ని వార్తలు