ఓ.. మై డాగ్‌!

30 Aug, 2020 05:18 IST|Sakshi

శునకాల పెంపకంపై పట్టణ వాసుల్లో పెరిగిన ఆసక్తి

వాటి ఆహారం.. వైద్యానికీ బడ్జెట్‌ కేటాయింపులు

సీమంతం.. బారసాల.. బర్త్‌డే, వర్ధంతులు

వాసన గ్రహించే జీవాణువులు మనుషుల కంటే కుక్కల్లో 40 రెట్లు అధికం

శునకాల మెదడులో సెరెబ్రల్‌ కార్టెక్‌ వల్ల వినికిడి శక్తి ఎక్కువ

దేశంలో 38 విదేశీ శునక జాతులు  

సాక్షి, అమరావతి: కుక్కల్ని పెంచుకునే అలవాటు పూర్వం నుంచీ ఉన్నా.. గత కొన్నేళ్లుగా మరింత పెరుగుతోంది. ఒంటరితనం నుంచి బయటపడేందుకు కొందరు శునకాలను పెంచుకుంటుండగా.. మరికొందరు అభిరుచిగా స్వీకరిస్తున్నారు. ఇందుకోసం ఇంటి బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేస్తున్నారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రధాన నగరాల్లో పశువుల కంటే పెంపుడు కుక్కల సంఖ్యే అధికంగా ఉండటం విశేషం. వాటికి సీమంతం, బారసాల, పుట్టిన రోజు, వర్ధంతులు, జయంతులు నిర్వహించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మరణించిన శునకాలకు సమాధులు, అక్కడక్కడా వాటి విగ్రహాలు ప్రతిష్టించడం కూడా కనిపిస్తోంది. 

► శునకాలను పెంచేవారు వారి స్థాయిని.. వాటి రకాన్ని బట్టి బడ్జెట్‌లో నెలవారీ, వార్షిక కేటాయింపులు చేస్తున్నారు. 
► ఒక్కో శునకానికి అవి తినే ఆహారాన్ని బట్టి నెలకు రూ.వెయ్యి నుంచి నుంచి రూ.10 వేల వరకు వెచ్చిస్తున్నారు.
► కుక్క జాతిని బట్టి పోషణకు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.1.30 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు.  
► టీకాలు, ఇతర మందులు, వైద్యానికి అయ్యే ఖర్చు సంవత్సరానికి రూ.5 వేల నుంచి రూ.12వేల వరకు అవుతుంది. ఏవైనా పెద్ద జబ్బులు చేస్తే ఇంకాస్త ఎక్కువే ఖర్చవుతోంది. 
► కాపలాకు, పోలీస్‌ పనులకు, అంధులకు దారి చూపేందుకు, మత్తు మందుల జాడ తెలుసుకునేందుకు డాబర్‌మెన్‌ను ఉపయోగిస్తారు.   
► కాపలాకు గ్రెడెన్, అల్సేషన్‌ వంటి 13 రకాలను వినియోగిస్తారు. యజమానికి తోడు కోసం పమేరియన్, డాషాండ్‌ వంటి 16 రకాల శునకాలను వినియోగిస్తారు.  
► కాపలాకు, పోలీసు పనులకు, తప్పిపోయిన వారి జాడ కనుగొనేందుకు రాట్‌ వీలర్, బెల్జియన్‌ టెర్వురెన్‌ను.. దొంగలు, తప్పిపోయిన వారి జాడ తెలుసుకునేందుకు బ్లడ్‌ హౌండ్‌ అనే జాతిని ఉపయోగిస్తారు.  
► వేటకు, రక్షణకు ఐరిష్‌ వాటర్‌ స్పానియాల్, బోర్డర్‌ టెరియర్, పాయింటర్, గ్రేహౌండ్, సాలూకి వంటి జాతులను, వాసన పసిగట్టేందుకు ఇంగ్లిష్‌ సెట్టర్‌ను వినియోగిస్తారు. 

350 జాతులు 
► ‘టోమార్క్‌ టాస్‌’ అనే చిన్నపాటి జంతువులు శునక జాతికి పూర్వీకులని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  
► ప్రపంచవ్యాప్తంగా 350 జాతులను అభివృద్ధి చేశారు. వీటిని స్పోర్టింగ్, హౌండ్, వర్కింగ్, ట్రేయర్, టాయ్, నాన్‌ స్పోర్టింగ్, ఫిష్‌ హార్డింగ్‌ అనే 7 గ్రూపులుగా విభజించారు. వీటిలో 38 జాతులు మన దేశంలో ఉన్నాయి. 
► పాయింటర్, ఇంగ్లిష్‌ సెట్టర్, లేబ్రడార్, ఐరిష్‌ వాటర్‌ స్పానియాల్, కాకర్‌ స్పానియాల్, గ్రేహౌండ్, ఆప్ఘన్‌ హౌండ్, సాలూకి, బ్లడ్‌ హౌండ్, డాషాండ్, మాస్టిఫ్, గ్రేట్‌ డెన్, డాబర్‌మెన్, బుల్‌ మాస్టిఫ్, రాట్‌ వీలర్, ఎయిర్‌ డేర్‌ టెరియర్, బుల్‌ టెరియర్, స్కాటిష్‌ టెరియర్, బోర్డర్‌ టెరియర్, నార్‌విచ్‌ టెరియర్, పగ్, పమేరియన్, పెకింగిస్, మాల్టిసి, చిహు అహువా, కిషాండ్, డాల్మేషియన్, బుల్‌ డాగ్, చౌచౌ, బోస్టన్‌ టెరియర్, బెల్జియన్‌ టెర్వురెన్, బోర్డర్‌ కూలీ, బ్రియార్డ్, రఫ్‌ కూలీ, అల్సేషియన్, బాక్సర్, గోల్డెన్‌ రిట్రైవర్, లసోప్సో వంటి విదేశీ కుక్క జాతులు మన దేశంలో ఉన్నాయి.  
► రాజుపాళ్యం, చిట్టి తారి అనే స్థానిక జాతులూ ఉన్నాయి.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా