సచివాలయాల ఉద్యోగులకు ఈ నెల నుంచే పెరిగిన వేతనాలు

26 Jul, 2022 03:44 IST|Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ కార్యదర్శి 

ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయడంతో కొత్త పీఆర్సీ మేరకు వేతనాలు

గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాలకు రూ.768.60 కోట్లు అదనంగా విడుదల

వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలపై నేడో రేపో ఉత్తర్వులు

ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ ఖరారు అనంతరం ఈ నెల నుంచే కొత్త పీఆర్సీ పేస్కేలు ప్రకారం పెరిగిన వేతనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరికి పే స్కేలుతో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్స్‌లు కలిపిన వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖలో కొత్తగా వివిధ ఖాతా (హెడ్‌)ల ఏర్పాటుతో పాటు అదనపు బడ్జెట్‌ కేటాయింపులు చేసింది. ప్రత్యేకించి గ్రామ సచివాలయాల ఉద్యోగుల వేతనాల కోసం కేటాయించిన రూ.768.60 కోట్ల అదనపు నిధులను విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో  గ్రామ సచివాలయ ఉద్యోగుల వేతనాల కోసం ఇప్పటికే రూ. 1,995 కోట్లు విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన నిధులతో కలిపి మొత్తం రూ. 2,763.60 కోట్లు విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా పెరిగిన వేతనాలు ఈ నెల నుంచి రానున్నాయి. ఇందుకు అదనపు నిధులను నేడో రేపో విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. 

కొత్త హెడ్‌ల ఏర్పాటుకు ఆదివారమూ పనిచేశారు: ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి 
ఆర్థిక శాఖ అధికారులు సెలవు దినమైనప్పటికీ ఆదివారం రోజు కూడా వచ్చి సచివాలయాల ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అన్ని హెడ్స్‌ను రూపొందించారని, పెరిగిన జీతాలకు అనుగుణంగా అదనపు కేటాయింపులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సచివాలయాల ఉద్యోగులకు కొత్త వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి  ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వార్డు సచివాలయాల ఉద్యోగులకు పెరిగిన జీతాల జీవో కూడా వేరుగా విడుదలవుతుందని చెప్పారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, అందరికీ పే స్కేల్‌ ప్రకారం జీతాలు వస్తాయని పేర్కొన్నారు. కాగా, ఇచ్చిన హామీ మేరకు సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు, పెరిగిన వేతనాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భీంరెడ్డి అంజన్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బి.ఆర్‌.ఆర్‌.కిషోర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్స్‌ విప్పర్తి నిఖిల్‌ కృష్ణ, భార్గవ్‌ సుతేజ్‌ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. జాని పాషా వేరొక ప్రకటనలో సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సీఎంకు ఉద్యోగుల ధన్యవాదాలు 
నెహ్రూనగర్‌(గుంటూరు ఈస్ట్‌):  ప్రొబేషన్‌ పూర్తి చేసుకున్న  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పెరిగిన జీతాలు అందుతాయని గ్రామ,వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు చెప్పారు. సోమవారం గుంటూరు డొంక రోడ్డులో ఉన్న సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కిషోర్, కో ఆర్డినేటర్‌ తోట మహేష్‌ ,గుంటూరు జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌ రాథోడ్, మహిళా విభాగం అధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు