AP: భగభగలు..

1 May, 2022 03:32 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలు

3 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు 

తెలంగాణ నుంచి ఉత్తరాంధ్ర మీదుగా ఒడిశా వైపు వీస్తున్న వేడిగాలులు

వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన ఎండలు 

మిగిలిన ప్రాంతాల్లోనూ అధికంగానే..

ఉక్కపోతతో ప్రజల విలవిల

మే నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక

సాక్షి, అమరావతి/రెంటచింతల: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. ఉ.9 గంటల నుంచి సా.5 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. వారం రోజులుగా అన్ని ప్రాంతాల్లో సగటున 3 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా ఉ.8 నుంచి 10 గంటల మధ్య 26–28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాల్సి వుండగా ప్రస్తుతం 30 నుంచి 32 డిగ్రీలు నమోదవుతోంది. 10 నుంచి 12 గంటల మధ్య 36–38 డిగ్రీలు ఉండాల్సి వుండగా 40 డిగ్రీలు నమోదవుతోంది. ఇక మ.12–3 గంటల మధ్య 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 26–29 నుంచి 30–32 డిగ్రీలకు పెరిగాయి. 

మే నెలాఖరు వరకు ఇదే పరిస్థితి 
ఇక మే 8వ తేదీ వరకు ఈ పరిస్థితి ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. ఆ తర్వాత నెలాఖరు వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ను అతలాకుతలం చేస్తున్న వేడిగాలులు అక్కడి నుంచి తెలంగాణ మీదుగా ఒడిశా వైపు వీస్తున్నాయి. ఈ గాలులు ఉత్తరాంధ్ర మీదుగా వెళ్తుండడంతో పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోను వాటి ప్రభావం ఉంటోంది. 
 
నిప్పుల కొలిమిలా రెంటచింతల 
గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తోంది. బుధ, గురు, శుక్రవారాలలో వరుసగా మూడ్రోజులుగా 44.6, 44.2 45.4 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి. శనివారం గరిష్టంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీలుగా నమోదు కావడంతో ఒక్కసారిగా రెంటచింతల అగ్నిగుండంగా మారింది. పనులకు వెళ్లిన కూలీలు ఎండకు తట్టుకోలేక ఉ.11 గంటలకే ఇంటి ముఖం పట్టారు. వడగాడ్పులతో వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం 43, 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా పడమలలో అత్యధికంగా 44.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కలిగిరిలో 44.6, గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో 44.1, శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో 44, ప్రకాశం జిల్లా యద్ధనపూడి, కర్నూలు జిల్లా మహానంది, పెరుసోమల, ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల, గొల్లవిడిపిలో 43.9, అనంతపురం జిల్లా తరిమెలలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
► సాధ్యమైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకూడదు. 
► తలపై టోపీ లేకపోతే కర్చీఫ్‌ కట్టుకోవాలి. పలుచటి కాటన్‌ వస్త్రాలు ధరించడం మేలు.
► ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్‌ కలిపిన నీటిని తాగాలి.
► వడ దెబ్బకు గురైన వారిని వెంటనే చల్లటి ప్రాంతానికి చేర్చాలి. తడిగుడ్డతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి.  
► మంచినీరు ఎక్కువగా తాగాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు ఒక గ్లాసు మంచి నీరు తాగాలి. 
► ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసం, కొబ్బరినీరు తాగాలి.
► ఎండలో ఉన్నప్పుడు తల తిరుగుతుంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.

5న అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం 
వాయుగుండంగా బలపడే అవకాశం
దక్షిణ అండమాన్‌ సముద్రంలో మే 5న అల్పపీడనం ఏర్పడనుంది. తొలుత 4న ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత 24 గంటల్లో అల్పపీడనంగా మారుతుంది. అనంతరం బలమైన అల్పపీడనంగాను, ఆపై వాయుగుండంగాను బలపడుతుంది. ఇది ఉత్తర, ఈశాన్య దిశగా కదులుతూ మయన్మార్‌ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాష్ట్రంపై అంతగా ప్రభావం ఉండే అవకాశంలేదు. అందుకు భిన్నంగా పశ్చిమ/వాయవ్య దిశగా పయనిస్తే మాత్రం రాష్ట్రంలో వర్షాలకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. ఈ వాయుగుండం తీరాన్ని దాటాక రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి ఆర్‌. మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు.

మరిన్ని వార్తలు