బస్తీమే సవాల్‌.. ఛాలెంజ్‌గా మారిన ట్రాఫిక్‌ నియంత్రణ

29 Apr, 2022 11:38 IST|Sakshi

సాక్షి, గుంటూరు, తెనాలి, నరసరావుపేట: నగర/పట్టణాల్లో జనాభా నానాటికీ పెరుగుతోంది. జీవనం ఉరుకులు పరుగుల మయమవుతోంది. దీనికి అనుగుణంగా వాహనాల వినియోగమూ పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్‌ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. వాహనాల రద్దీతో నిత్యం రోడ్లు కిటకిటలాడుతున్నాయి. రాకపోకల నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే తలకు మించిన భారమే అవుతోంది.   

గుం‘టూరు కష్టమే’  
గుంటూరు నగరం  రోజురోజుకూ విస్తరిస్తోంది. సమీపంలోని గ్రామాల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలు చాలా వరకు నగరంలో కలిసిపోయాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు నగర జనాభా 6.76 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా ఉంటుందని అధికారుల 
అంచనా. నగరంలో మొత్తం అన్ని రకాల వాహనాలు కలిపి సుమారుగా 6,43,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో నగరంలో రద్దీ పెరిగింది. దీనికి తగ్గట్టు ప్రధాన రహదారుల విస్తరణ జరగకపోవడంతో నగరం ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. పార్కింగ్‌ సమస్య వేధిస్తోంది.  

పరిష్కారం దిశగా ప్రభుత్వం..
ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణమే శరణ్యమని ప్రభుత్వం గుర్తించింది. శంకర్‌విలాస్‌ వద్ద బ్రిడ్జి విస్తరణ లేదా కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు.   ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో ఉన్న గడ్డిపాడు రైల్వేగేట్, శ్యామలానగర్, నెహ్రూనగర్, సంజీవయ్య నగర్, సీతారామ్‌నగర్‌ రైల్వేగేట్ల వద్ద ఆర్వోబీ, ఆర్‌యూబీలు నిర్మించడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిలోభాగంగా ఆర్‌అండ్‌బీ, జీవీఎంసీ అధికారులు ఇటీవల పరిశీలన చేశారు. నందివెలుగు రోడ్డు రైల్వే వంతెన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పలు రోడ్ల విస్తరణకూ ప్రతిపాదనలు ఉన్నాయి.  

ఆంధ్రా ప్యారిస్‌లోనూ పాట్లు
గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ, ఆంధ్రా ప్యారిస్‌గా గుర్తింపు పొందిన తెనాలిలోనూ ట్రాఫిక్‌ పాట్లు తప్పడం లేదు. ఆక్రమణలతోపాటు రోడ్లపైనా వ్యాపారాల వల్ల ఈ సమస్య జఠిలమవుతోంది.  తెనాలి పట్టణ జనాభా రెండు లక్షలకుపైగానే ఉంటుంది. అన్ని రకాల వాహనాలు కలిపి 1.10 లక్షల వరకు ఉంటాయని తెలుస్తోంది.  సమీపంలోని వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి రోజూ 40 నుంచి 50 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా పట్టణంలో రోడ్ల విస్తరణ జరగలేదు.  పార్కింగ్‌ సమస్య కూడా వేధిస్తోంది. వీధివ్యాపారులకు ప్రత్యేక స్థలం, పార్కింగ్‌ జోన్ల కేటాయింపు కాగితాలకే పరిమితమైంది. 

పరిష్కారమార్గం  
ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణమే మార్గం. గతంలో మార్కెట్‌ వంతెన వద్ద స్కైవాక్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సర్వే చేశారు.  నెహ్రూ, బోస్, మెయిన్, బుర్రిపాలెం రోడ్లను విస్తరించాలి. మరో కొత్త వంతెన అవసరం ఉంది. కాలువ రోడ్లను విస్తరించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది.  

పేటలోనూ ‘నడక’యాతనే
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోనూ ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1.18 లక్షలు. ఇప్పుడు 1.50 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అన్ని రకాల వాహనాలు కలిపి 1,00,000 వరకు ఉంటాయని  తెలుస్తోంది. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచీ పట్టణానికి నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. దీంతో పట్టణంలోని రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ట్రాఫిక్‌ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. పార్కింగ్‌ సమస్య వేధిస్తోంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సరిగా పనిచేయడం లేదు.  

ఫ్లైఓవర్‌ మంజూరు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ నరసరావుపేటలో ప్రస్తుతం రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌గ్రౌండ్‌ బ్రిడ్జి ఉంది. జిల్లా కేంద్రమైనందున  రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం ఆవశ్యకత అధికమైంది.  దీంతో  రెండు ఆర్‌యూబీలు, ఓ ఫ్లైఓవర్‌ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికీ తీసుకెళ్లారు. మల్లమ్మసెంటర్‌ నుంచి గడియారం స్తంభం సెంటర్‌వరకు ఫ్లైఓవర్‌ మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. లాల్‌బహుదూర్‌ కూరగాయల మార్కెట్‌ సెంటర్‌ వెనుకగా చిత్రాలయ థియేటర్‌ ఎదురుగా ఆర్‌యుబీ నిర్మాణానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొచ్చారు. వీటితోపాటు రోడ్ల విస్తరణ పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య తీరినట్టే. 

కిలోమీటర్‌ మేర బారులు  
గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కోసారి కిలోమీటర్‌ మేర వాహనాలు బారులు తీరుతుంటాయి.  శ్యామలానగర్‌ రైల్వే గేట్‌ పడిందంటే అంతే సంగతులు. వెంటనే ఇక్కడ రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ను నిర్మించాలి.  గడ్డిపాడు రైల్వే గేట్‌ వల్ల ట్రాఫిక్‌ ఆగిపోతోంది. ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలి.  
– మాన్నిడి సుధమారుతిబాబు, నల్లపాడు, గుంటూరు

పూర్తి స్థాయిలో దృష్టి సారించాం  
ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు నిత్యం చర్యలు తీసుకుంటున్నాం. వారం రోజుల క్రితం డీఐజీ, ఎస్పీ సమీక్ష  చేశారు. ట్రిఫిక్‌ నియంత్రణపై దృష్టిసారించాం.  పలు ప్రాంతాల్లో డివైడర్లు తొలగించాలని జీఎంసీకి ప్రతిపాదలు 
పంపాం. పార్కింగ్‌ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.
– వీవీ రమణకుమార్, డీఎస్పీ, గుంటూరు సిటీ ట్రాఫిక్‌

పరిష్కారానికి సమష్టిగా కృషి  
తెనాలి పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తాం. దీనికి ప్రజల సహకారమూ అవసరం. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం పోలీసు శాఖ తరఫున అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధాన కూడళ్లలో వన్‌ వే, ఫ్రీ లెఫ్ట్‌ వంటివి ఏర్పాటు చేశాం. 
– జోగి శ్రీనివాస్, ట్రాఫిక్‌ ఎస్‌ఐ, తెనాలి

 
రోడ్లు విస్తరించాలి
నరసరావుపేటలో ట్రాఫిక్‌పై పోలీసులు దృష్టిపెట్టాలి. రోడ్లను విస్తరించాలి. వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్‌ కేటాయిస్తే మేలు. పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. ఆటోవాలాలను నియంత్రించాలి.   
– గుదే రామయ్య, బరంపేట, నరసరావుపేట   

ఔటర్‌ రింగ్‌ రోడ్డు ద్వారా మళ్లిస్తాం  
నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు సమష్టిగా కృషి చేస్తున్నాం.  ఔటర్‌ రింగ్‌రోడ్డును ఉపయోగించి ఇకపై  వినుకొండ, పల్నాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గుంటూరు వైపు వెళ్లాల్సిన వాహనాలను మళ్లిస్తాం. దీనివల్ల పట్టణంలో రద్దీ తగ్గుతుంది.  ట్రాఫిక్‌ సిగ్నల్స్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం.   
– సి.విజయభాస్కరరావు , డీఎస్పీ, నరసరావుపేట   

మరిన్ని వార్తలు