మాకొక ‘కారు’ కావలె.. ఎందుకంటే కారణాలివే? 

18 Mar, 2022 12:57 IST|Sakshi

కర్నూలు: ఒకప్పుడు కారులో ప్రయాణించడమంటే గొప్పగా భావించే సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇప్పుడు కారుకు జై కొడుతున్నారు. మాకొక కారు కావలె అంటూ.. కార్ల వైపు చూస్తున్నారు. కరోనా భయంతో కారే నయం అంటున్నారు. బడ్జెట్‌ కుదిరితే కారు.. లేదంటే బైక్‌ కొనుగోలు చేస్తున్నారు. కరోనా మార్చిన జీవనయానం, పెరిగిన రవాణా చార్జీల నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రజా రవాణాపై ఆధారపడిన వారు లాక్‌డౌన్‌ సమయంలో చాలా ఇబ్బందులుపడ్డారు.

చదవండి: విశాఖ జూకు కొత్త జంతువులు వచ్చాయోచ్‌.. అవేమిటంటే..?

సడలించిన తరువాత కూడా భౌతిక దూరం పాటింపు, కోవిడ్‌ భయంతో సొంత వాహనాలే మేలన్న అభిప్రాయంతో ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రజలు వారి ఆర్థిక స్తోమతను బట్టి కొత్త లేదా పాత వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో జిల్లా లో వాహనాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఈ ఏడాది రెండు నెలల్లో రిజి్రస్టేషన్‌ అయిన వాహనాల సంఖ్య సుమారు 10 వేలు ఉండగా వాటిలో సగానికి పైగా ద్విచక్ర వాహనాలే. స్కూలు బస్సులు, లారీలు, ట్రక్కులు, గూడ్సు వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాలు కలిపి 1,169 వరకు రిజి్రస్టేషన్‌ జరిగాయి. కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి ముఖ్య పట్టణాలతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వాహన విక్రయాల షోరూమ్‌లు, వ్యాపార అనుబంధ శాఖలు, విడిభాగాల అమ్మకాలు, మరమ్మతుల దుకాణాలు, మెకానిక్‌ షెడ్లు దాదాపు 2250 వరకు ఉన్నాయి. ఈ రంగానికి సంబంధించి రోజుకు సగటున రూ. 2.50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంటుంది.

పాత వాహనాలకు డిమాండ్‌  
కొంతకాలంగా పాతకార్లు, బైకులకు డిమాండ్‌ పెరిగింది. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో ప్రయాణ కష్టాలను అనుభవించిన కొందరు మరో ఆలోచన లేకుండా సెకండ్‌ హ్యాండ్‌ కార్లు కొనుగోలు చేసి ఆ తరువాత డ్రైవింగ్‌ నేర్చుకుని దూసుకెళ్తున్నారు. ఒక ప్పుడు నగరాలకే పరిమితమైన పాతకార్ల కొనుగో లు ట్రెండ్‌ మండలాలు, గ్రామాలకు పాకింది. రూ. 5 లక్షలు పెడితే చాలు కండిషన్‌లో ఉన్న సెకండ్‌ హ్యాండ్‌ కారు వస్తుందని కర్నూలుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన స్వీయఅనుభవాన్ని తెలిపాడు.

రవాణా శాఖ లెక్కలేం చెబుతున్నాయంటే   
రవాణాశాఖ అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో గతేడాది 3800 కార్లకు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలోనే 700కు పైగా కార్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. సంపన్నులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ నేతలు, కొందరు ఉద్యోగులు మార్కెట్‌లోకి వచ్చిన కొత్తరకం కార్లను కొంటుండగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు, చిరు వ్యాపారులు రూ. 3 నుంచి రూ. 5 లక్షల విలువైన కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

ఆసక్తికి కారణాలివే  
లాక్‌డౌన్‌ సమయంలో ప్రజా రవాణా నిలిచిపోవడం, సడలింపు తరువాత చార్జీల భారం పెరగడం. 
ద్విచక్ర వాహనం ఇద్దరికే పరిమితం కావడం, కారైతే కుటుంబమంతా అనువుగా ఉండటంతో కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. 
రూ. 5 లక్షల విలువైన కారుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష చెల్లిస్తే చాలు అందుబాటులోకి వచ్చేలా ఫైనాన్స్‌ సౌకర్యం చేరువైంది.  
వాయిదాలను కూడా వార్షిక ఆదాయానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడంతో కారు విక్రయాల జోరు సాగుతోంది.  

అందుబాటులో షోరూంలు   
కార్ల కొనుగోళ్లకు గతంలో జిల్లా కేంద్రం కర్నూలుకు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లకు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు నంద్యాల, ఆదోని ప్రాంతాలకు వెళ్లేవారు. ఇప్పుడు అన్ని నియోజకవర్గ కేంద్రాలకు షోరూంలు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ వడ్డీతో పాటు సులభతర వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు మంజూరు చేస్తుండటంతో గ్రామీణులు సైతం వాహన కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.

వ్యక్తిగత వాహన కొనుగోళ్లు పెరిగాయి 
జిల్లాలో వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు బాగా పెరిగాయి. ప్రజా రవాణాపై ఆధారపడిన వారు లాక్‌డౌన్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో సొంత వాహనాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. పండుగల సీజన్‌ నేపథ్యంలో వాహనాల విక్రయాలు ఊపందుకుంటాయి. రవాణా రంగం ద్వారా ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ. కోట్లలో ఆదాయం వస్తోంది.  
– రమేష్‌, ఇన్‌చార్జ్‌ డీటీసీ  

మరిన్ని వార్తలు