పోషకాల రారాజు.. జీడిపప్పు

21 Sep, 2021 05:24 IST|Sakshi

కరోనా నేపథ్యంలో పెరుగుతున్న వినియోగం

మారిన పరిస్థితులు, అలవాట్లూ కారణమే 

ఉత్పత్తిలో దేశంలోనే ఏపీకి రెండో స్థానం

జీడి పరిశ్రమను దెబ్బతీసిన తిత్లీ తుపాను, కరోనా

సాక్షి, అమరావతి: ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన జీడిపప్పు వినియోగం ప్రస్తుతం మధ్యతరగతి వర్గాలకు సైతం చేరువవుతున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో చాలా డ్రైఫ్రూట్స్‌ ఉన్నప్పటికీ జీడిపప్పుకున్న ఆదరణ మరే ఉత్పత్తికి లేకుండాపోయింది. ప్రత్యేకించి కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో అత్యధిక పోషకాలు కలిగిన జీడి ప్రతి ఒక్కరి ఆహారంలో  భాగమయ్యిందంటే అతిశయోక్తి కాదు. పండుగల సమయంలో ప్రముఖులకు, ఆత్మీయులకు స్వీట్‌ బాక్సులు గిఫ్ట్‌గా పంపడం ఆనవాయితీ. అలాగే కరోనా సమయంలోనూ బయట తయారు చేసే స్వీట్ల పట్ల విముఖత పెరగడంతో వాటికి బదులు పోషకాలు ఎక్కువగా ఉన్న డ్రైఫ్రూట్స్‌ బాక్సుల్ని బహుమతులుగా పంపి ఆత్మీయతను చాటుకుంటున్నారు. కోవిడ్‌ నిబంధనలను సవరించిన ప్రస్తుత తరుణంలో జీడి పప్పు వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు ఇది ఖరీదైన వ్యవహారమనే సాధారణ ప్రజల అభిప్రాయం మారడం కూడా డ్రైఫ్రూట్స్‌ ప్రత్యేకించి జీడిపప్పుకు గిరాకీ పెరగడానికి కారణమైంది. వంటిళ్లలో తయారు చేసే తీపి పదార్థాల స్థానంలో జీడిపప్పును స్నాక్స్‌గా ఇచ్చే సంప్రదాయం కూడా ఇందుకు కలిసివచ్చింది.

అత్యవసరమైన పోషక వస్తువుగా జీడి..
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది. అత్యవసరమైన పోషక వస్తువుగా జీడిని గుర్తించారు. ఫలితంగా వినియోగం పెరిగింది. రాబోయేది పండుగల సీజన్‌. కరోనా ఆంక్షలు తొలగాయి. అందువల్ల ఈ ఏడాది జీడిపప్పు గిఫ్ట్‌ బాక్సుల వ్యాపారం బాగా సాగవచ్చునని హోల్‌సేల్‌ జీడిపప్పు వ్యాపారి కె.శ్రీనివాస్‌ చెప్పారు.  కిలో రూ.450 నుంచి రూ.900 వరకు జీడిపప్పు దొరుకుతుంది.  

జీడిపప్పు వినియోగం ఇలా.. 
2017 నుంచి 2020 వరకు సేకరించిన డేటా ప్రకారం జీడిపప్పు తలసరి వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 12 గ్రాములైతే పట్టణ ప్రాంతాల్లో 96 గ్రాములు. గతంలో పోల్చుకుంటే ఇది చాల ఎక్కువని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కమ్యూనిటీ సైన్స్‌ ప్రొఫెసర్‌ టి.గోపీకృష్ణ చెప్పారు.  అందువల్ల వ్యాపారులు ఎక్కువగా పట్టణ, నగర ప్రాంతాలలోనే జీడిపప్పు వ్యాపారం చేస్తున్నారు.  జీడిపప్పు వినియోగం పెరుగుదల ఏడాదికి 5 శాతంగా అంచనా వేశారు. 

60 దేశాలకు ఎగుమతులు..
మన రాష్ట్రం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకే కాకుండా అమెరికా, అరబ్‌ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, జపాన్‌ సహా 60 దేశాలకు జీడిపప్పు ఎగుమతి అవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మామూలు పరిస్థితుల్లో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు మార్కెట్‌లో ముడి జీడి దొరుకుతుంది. అయితే 2018లో వచ్చిన తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలోని తోటల్ని దెబ్బతీయగా.. 2019లో వచ్చిన కరోనా దేశవ్యాప్తంగా జీడి పరిశ్రమను మరింత దెబ్బతీసింది. వేలాది మందికి ఉపాధి కల్పించే పలు పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో ఇతర దేశాలు.. ప్రత్యేకించి ఆఫ్రికా నుంచి ముడి గింజలను దిగుమతి చేసుకోవడానికి భారత్‌ దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. సాగు పద్ధతులను ఆధునీకరించి ఎక్కువ బంజరు భూములను సాగులోకి తీసుకురావడం ద్వారా అదే పరిమాణంలో దేశీయంగా ఉత్పత్తి చేయవచ్చు. ముడి గింజలకు ఇతరులపై ఆధారపడే కన్నా సమీకృత వ్యూహాలను అవలంభిస్తే మేలని నిపుణులు చెబుతున్నారు. ఉత్పత్తి,  ప్రాసెసింగ్, మార్కెటింగ్‌ రంగాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు.  

ఏటా రూ.300 కోట్ల వ్యాపారం
మనరాష్ట్రంలోని 8 జిల్లాల్లో 4.53 లక్షల ఎకరాల్లో జీడి మామిడి సాగవుతుంది. లక్ష టన్నుల వరకు దిగుబడి వస్తుంది. జీడి ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రతి రోజూ 60 వేల కిలోలకు పైగా జీడిపప్పు (గుండ్రాలు) ఉత్పత్తి అయ్యేవి. సగటున ఒక కేజీ నాణ్యమైన జీడిపప్పు (గుండ్రాలు) రావడానికి మొత్తం 3.5 కిలోల జీడిపప్పును శుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా రూ.300 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. 

మరిన్ని వార్తలు