పెరుగుతున్న ఏపీ జెన్‌కో సామర్థ్యం

14 Apr, 2021 03:47 IST|Sakshi

కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ రెడీ

మేలో అనుసంధానం.. జూన్‌లో ఉత్పత్తి

జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం ఇక 5,810 మెగావాట్లు

ఇక రోజూ 35 ఎంయూల విద్యుత్‌ అదనం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ రంగ సంస్థ.. ఏపీ జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగబోతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కృష్ణపట్నం)లో కొత్తగా 800 మెగావాట్లు అందుబాటులోకి రానుంది. మే 20 నాటికి ఈ  ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి మొదలవుతుంది. దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. జూన్‌ నెలాఖరు నాటికి వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ)కి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 5,010 మెగావాట్లు . కృష్ణపట్నం కొత్త యూనిట్‌ను కూడా కలుపుకుంటే ఇది 5,810 మెగావాట్లు అవుతుంది. వాస్తవానికి ఇబ్రహీంపట్నంలోని మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ కూడా ఇదే సమయానికి అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనుల్లో ఆలస్యం చేసింది. 

రెండేళ్లుగా పుంజుకున్న వేగం
► కృష్ణపట్నంలో మొదటి దశలో 800 మెగావాట్ల రెండు సూపర్‌ క్రిటికల్‌ (అత్యాధునిక టెక్నాలజీ) థర్మల్‌ యూనిట్లను నిర్మించారు. రెండో దశలో మరొక ప్లాంట్‌ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇది 2018లోనే పూర్తవ్వాలి. కానీ గత టీడీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇవ్వడం, సకాలంలో ప్రాజెక్టు పూర్తవ్వని కారణంగా వ్యయం పెరిగింది. 
► కొత్తగా ఏర్పడ్డ ఈ ప్లాంటుకు మహానది కోల్‌ ఫీల్డ్‌ (ఎంసీఎల్‌) నుంచి ఏడాదికి 3.54 మిలియన్‌ టన్నుల బొగ్గు లింకేజీ కూడా ఉంది. రెండు ప్రాజెక్టులను ఒకే కాంట్రాక్టు సంస్థకు కాకుండా..  సివిల్‌ బాయిలర్, టరై్బన్, జనరేటర్‌ (బీటీజీ)ని ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌)కు ఇచ్చారు. సివిల్‌ కాంట్రాక్టు పనులను టాటా సంస్థకు అప్పగించారు. 
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు థర్మల్‌ ప్లాంట్ల పనులపై దృష్టి పెట్టింది. జాప్యం చేస్తే నిర్మాణ వ్యయం పెరిగి, విద్యుత్‌ ధర ఎక్కువయ్యే ప్రమాదం ఉండటంతో ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కోదానికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకొచి్చంది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి.

రాష్ట్రానికి ఉపయోగాలివే..
► జెన్‌కో కొత్త ప్లాంట్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తే బయట నుంచి విద్యుత్‌ను కొనాల్సిన అవసరం తప్పుతుంది.
► అలాగే డిమాండ్‌ (పీక్‌) టైమ్‌లో కోతలకు ఆస్కారం లేకుండా విద్యుత్‌ను అందించవచ్చు.
► ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నూటికి నూరు శాతం విద్యుత్‌ లభ్యతకు గ్యారెంటీ ఉంటుంది.
► అత్యధిక పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) వచ్చే అవకాశం ఉంది.  

జూన్‌లో ఉత్పత్తి
కృష్ణపట్నం 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ను జూన్‌ చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే స్టీమ్‌లైన్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు ఫ్యూల్‌ గ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌ (ఎఫ్‌జీడీ) ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కింది భాగం నుంచే బూడిద విడుదలయ్యే కొత్త టెక్నాలజీని ఈ ప్లాంట్‌లో ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రానికి రోజుకు మరో 35 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అదనంగా అందుతుంది. 
– చంద్రశేఖర్‌రాజు, థర్మల్‌ డైరెక్టర్, జెన్‌కో  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు