పుంజుకుంటున్న విమానయానం

8 Jun, 2021 04:36 IST|Sakshi

విజయవాడ ఎయిర్‌పోర్టులో పెరుగుతున్న ప్రయాణికులు

సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో మే నెలలో 16,381 మందే రాకపోకలు

జూన్‌ ఆరంభం నుంచి తిరిగి పుంజుకున్న ప్రయాణాలు

సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కల్లోలం నుంచి కోలుకుని విమానయానం క్రమేపీ వేగం పుంజుకుంటోంది. సెకండ్‌ వేవ్‌ ఉధృతిలో కాస్త తగ్గుదల కనిపిస్తుండటంతో క్రమంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. విజయవాడ విమానాశ్రయం కూడా సెకండ్‌ వేవ్‌ ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ నెల ఆరంభం నుంచి విజయవాడ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. కోవిడ్‌కు ముందు ఈ ఎయిర్‌పోర్టు నుంచి నెలలో 75 వేల నుంచి 90 వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కోవిడ్‌ రెండో దశ తీవ్ర రూపం దాల్చిన ఏప్రిల్‌ నెలలో 44,214 మంది ప్రయాణాలు చేయగా, మే నెలలో ఆ సంఖ్య 16,381కి తగ్గింది. అయితే జూన్‌ ఆరంభం నుంచి పరిస్థితి మారింది. రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సగటున రోజుకు 600 మంది విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లకు ఎక్కువగా వెళ్తున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 10 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు వందే భారత్‌ మిషన్‌ కింద మస్కట్, దుబాయ్, సింగపూర్, కువైట్‌ల నుంచి అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి.

ఢిల్లీ సర్వీసు రద్దుతో ఇక్కట్లు..
ఎయిరిండియా సంస్థ ఢిల్లీ – విజయవాడ ఎయిర్‌పోర్టుల మధ్య రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు విమాన సర్వీసులను నడిపేది. వీటిలో ఉదయం సర్వీసును జూలై 31 వరకు రద్దు చేశారు. ప్రధానంగా ఈ సర్వీసు అమెరికా నుంచి వచ్చి, వెళ్లే వారికి ఎంతో అనుకూలంగా ఉండేది. అమెరికా నుంచి అర్థరాత్రి దాటాక ఢిల్లీ చేరుకునే వారు ఈ సర్వీసు ద్వారా ఉదయానికల్లా విజయవాడకు వచ్చేవారు. ఇప్పుడు సాయంత్రం సర్వీసు ఒక్కటే ఉండడం వల్ల వీరంతా 20 గంటలకు పైగా ఢిల్లీలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్లేవారూ దాదాపు ఓ రోజు అదనంగా ఢిల్లీలో గడపాల్సి వస్తోందంటున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన ఢిల్లీ విమాన సర్వీసును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.  

ప్రయాణికుల సంఖ్య పెరిగింది
పక్షం రోజుల్లో ప్రయాణికుల సంఖ్య రోజుకు వెయ్యికి చేరుకుంటుంది. ఈ నెలాఖరుకి ప్రయాణికుల సంఖ్య మునుపటి సగటు ప్రయాణికుల్లో 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 
– జి.మధుసూదనరావు, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు