ఏపీ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. వచ్చే 3 రోజులు ఎండ మంటే

14 May, 2023 10:30 IST|Sakshi

పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటే అవకాశం 

తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం 

ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక 

సాక్షి, అమరావతి: వచ్చే 3 రోజులు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలకంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆది­వారం నుంచి ఎండ తీవ్రత ఇంకా పెరగనుంది. ఆ­దివారం కోస్తా జిల్లా­ల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకంటే ఎక్కువ నమో­దయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 136 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 173 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేద్కర్‌ తెలిపారు.

విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి  47 డిగ్రీల ఉష్ణోగ్రతలు న­మో­దయ్యే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, చి­త్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి  44 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంద­న్నా­­రు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం నంద్యాల జిల్లా గోస్పాడులో అత్యధికంగా 42.2, తూర్పుగోదావరి జిల్లా నందరాడ, ముగ్గుళ్లలో 41.9, బాపట్ల జిల్లా అమృతలూరులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

అత్యంత తీవ్ర తుపానుగా ‘మోకా’! 
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను అత్యంత తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం ఇది గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోంది. శనివారం రాత్రికి పోర్టుబ్లెయిర్‌కు వాయవ్యంగా 610 కి.మీలు, బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్‌­కు దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ కాక్స్‌బజార్‌ (బంగ్లాదేశ్‌) – క్యాక్‌ప్యూ(మయన్మార్‌)ల మధ్య సిట్‌­వే వద్ద ఆదివారం మధ్యాహ్నం అత్యంత తీవ్ర తు­పానుగా తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో గరిష్టంగా గంటకు 210 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ శనివారం రాత్రి ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది.   

మరిన్ని వార్తలు