పసుపు పుచ్చకాయలు.. ఇకపై మన దేశంలోనే!

27 Aug, 2021 14:17 IST|Sakshi

వంగడాన్ని ప్రవేశపెట్టిన జర్మనీకి చెందిన విత్తన కంపెనీ

‘ఎల్లో గోల్డ్‌–48’ పేరిట మార్కెట్‌లో విత్తనాలు లభ్యం

సాక్షి, అమరావతి: వేసవి తాపాన్ని తీర్చే.. రుచికరమైన.. అందరూ ఇష్టంగా తినే ఫలాలలో ఒకటి పుచ్చకాయ. అయితే పుచ్చకాయ ఎలా ఉంటుంది అని అడిగితే ఎవరైనా ఏం చెప్తారు? ఆకుపచ్చ చారలుండే తొక్క, లోపల ఎరుపు/గులాబీ రంగు గుజ్జు, అందులో నల్లటి విత్తనాలు.. అనే కదా. కానీ ఈ ‘వెరైటీ’ పుచ్చకాయలో మాత్రం గుజ్జు పసుపు పచ్చ రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది.

అయితే, అది సహజ సిద్ధమైన రంగేనా? లేక రసాయనాలు వాడతారా? అంటే నూటికి నూరుపాళ్లు సహజసిద్ధంగా వచ్చిన రంగే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విత్తన తయారీ సంస్థలు. అంతేకాదు.. ఆకుపచ్చ తొక్క, ఎరుపు, గులాబీ, పసుపు రంగు కండతో విత్తనాలు లేని (సీడ్‌ లెస్‌) పుచ్చకాయలు కూడా త్వరలో మార్కెట్‌కు రానున్నాయని వివరిస్తున్నారు.

పసుపు రంగు ఎలా వస్తుందంటే..
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో 1,200కి పైగా పుచ్చ రకాలున్నాయి. వాటిల్లో పసుపు రంగు కాయ ఒకటి. ఈ పసుపు పుచ్చకాయలు కూడా ఎరుపు/గులాబీ రంగు కాయల మాదిరిగానే ఆకుపచ్చ చారలతో ఉంటాయి. లోపల కండ మాత్రం పసుపు రంగులో ఉంటుంది. పసుపు పుచ్చకాయల్లో లైకోపీన్‌ అనే పదార్థం ఉండదు కనుక అవి ఎప్పుడూ ఎర్రటి రంగును తీసుకోవని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. చిత్రమేమిటంటే పసుపు పుచ్చకాయల సాగు ఎరుపు/గులాబీ పుచ్చ కంటే ముందు నుంచే ఉంది. ఇదో సంకర విత్తనం. ఆఫ్రికా నుంచి వచ్చింది. సంప్రదాయ పుచ్చకాయలకు ఇదో ప్రత్యామ్నాయం. పర్పుల్‌ కాలే, ఆరెంజ్‌ కాలీఫ్లవర్, బ్లూ బంగాళాదుంపలు మాదిరే ఇదీనూ.

ఎల్లో గోల్డ్‌–48 రకం విడుదల..
రెండేళ్ల క్షేత్రస్థాయి ప్రయోగాలు, పరిశోధనల అనంతరం దేశంలో పసుపు పుచ్చ రకాన్ని మార్కెట్‌కు వాణిజ్యపరమైన వినియోగం కోసం విడుదల చేస్తున్నట్టు జర్మనీకి చెందిన బేయర్‌ కంపెనీ ప్రకటించింది. ఎల్లో గోల్డ్‌–48 పేరిట మార్కెట్‌లో ఈ విత్తనం దొరుకుతుంది. దేశంలో విడుదలైన తొలి పసుపు పుచ్చ వంగడం ఇదే. అత్యున్నత జెర్మీప్లాసమ్‌ నుంచి ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో పంట ప్రయోగాలు నిర్వహించిన అనంతరం దీన్ని మార్కెట్‌కు విడుదల చేశారు. దీంతో పాటు డిజర్ట్‌ కింగ్‌ ఎల్లో, ఎల్లో డాల్, బటర్‌కప్, ఎల్లో ఫ్లెష్‌బ్లాక్‌ డైమండ్‌ వంటి రకాలను పేరున్న విత్తన కంపెనీలు ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు విడుదల చేస్తున్నాయి.

‘సేంద్రీయ’ సాగు చేస్తే మంచి లాభాలు..
ఎల్లో గోల్డ్‌–48 అధిక దిగుబడి ఇచ్చే వంగడం. తెగుళ్లను, ఇతర క్రిమికీటకాలను తట్టుకుంటుంది. అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి మధ్య సాగు చేయవచ్చు. ఏప్రిల్‌ నుంచి జూలై వరకు దిగుబడి వస్తుంది. పంట కాలం గరిష్టంగా నాలుగు నెలలు. కాయ తియ్యగా, తేనె లాంటి రుచిని కలిగి ఉంటుంది. పోషక విలువలూ ఎక్కువే. పుచ్చ వేసవి కాలపు పంటే అయినా ఇప్పుడు అన్ని కాలాలలోనూ సాగు చేస్తున్నారు. పసుపు పుచ్చను సేంద్రీయ పద్ధతిలో సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ఈ రకాన్ని సాగు చేసేందుకు ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు