Vizag Steel Plant: 'విశాఖ ఉక్కు' ఖాయిలా పరిశ్రమ కాదు

20 Jul, 2021 03:56 IST|Sakshi

పెట్టుబడులు ఉపసంహరిస్తాం

ఉక్కు పరిశ్రమలపై కేంద్రం 

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు పరిశ్రమ ఖాయిలా పరిశ్రమ కాదని కేంద్రం పేర్కొంది. మరోవైపు పరిశ్రమ నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తామని స్పష్టం చేసింది. లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ, ఉక్కుశాఖ ఈ మేరకు సమాధానమిచ్చాయి. లోక్‌సభలో బీజేపీ ఎంపీ పూనం మహాజన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ సమాధానమిస్తూ.. ప్రభుత్వరంగ సంస్థల్లో స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌), రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌ – విశాఖ ఉక్కు పరిశ్రమ) ఉక్కు పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు.

ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థలు ఖాయిలా పడిన ప్రభుత్వరంగ సంస్థల జాబితాలోకి రావని స్పష్టం చేశారు. ఎంపీలు రవికిషన్, ఎస్‌కే గుప్తా, సుభ్రతపాఠక్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్‌ కారద్‌ సమాధానమిస్తూ..  ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానం ద్వారా  ప్రభుత్వరంగ సంస్థలు, ఉక్కు పరిశ్రమల్లో పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌ – విశాఖ ఉక్కు పరిశ్రమ)లో  పెట్టుబడులు ఉపసంహరించాలని ఈ ఏడాది జనవరి 27న  కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) నిర్ణయం తీసుకుందని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఉన్నతవిద్యలో ఆన్‌లైన్‌ లెర్నింగ్, డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ కోర్సెస్‌ ఇన్‌ రీజినల్‌ లాంగ్వేజెస్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.250 కోట్లు కేటాయించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పాదన ఆపాలని కోరాం
శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌హౌస్‌లో విద్యుత్‌ ఉత్పాదనను నిలిపివేయాలని కృష్ణానది యాజమాన్య నిర్వహణ బోర్డు (కేఆర్‌ఎంబీ), తెలంగాణ జెన్‌కోను కోరినట్లు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సోమవారం రాజ్యసభలో తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిని సాగు, తాగు అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఎమర్జెన్సీ క్రెడిట్‌లైన్‌ గ్యారంటీ పథకం కింద ఇప్పటి వరకు దేశంలోని 1.09 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకు ప్రభుత్వం రుణ గ్యారంటీ ఇచ్చినట్లు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి నారాయణ్‌రాణే.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రహదారులకు జాతీయ హోదా ప్రకటించేందుకు 12 కొత్త ప్రతిపాదనలు వచ్చాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి గడ్కరీ చెప్పారు.

రాష్ట్రంలోని 12 హైవేల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని బీజేపీ సభ్యుడు వైఎస్‌ చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (డ్రిప్‌) ఫేజ్‌–2, ఫేజ్‌–3 పథకాల్లో చేరేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమ్మతి తెలియజేస్తూ 31 డ్యాముల కోసం రూ.667 కోట్లతో అంచనాలు పంపించిందని బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. దేశంలో పోర్టుల అభివృద్ధి, తీర ప్రాంతాన్ని పూర్తిస్థాయి సద్వినియోగం చేసుకోవడం కోసం తీసుకొస్తున్న కొత్త చట్టం ముసాయిదా బిల్లుపై కొన్ని రాష్ట్రాల అభిప్రాయాలు, సూచనలు రావాల్సి ఉందని టీజీ వెంకటేశ్‌ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాలశాఖ సహాయమంత్రి శంతను ఠాకూర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు