INS Dhruv: ఇండియన్‌ జేమ్స్‌బాండ్‌.. ‘ధ్రువ్‌’

27 Apr, 2021 05:23 IST|Sakshi
ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌

నౌకాదళం అమ్ముల పొదిలో చేరనున్న అత్యాధునిక యుద్ధనౌక వీసీ–11184

రూ.1,500 కోట్లతో హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో నిర్మాణం పూర్తి

శత్రు దేశాల క్షిపణి ప్రయోగాల సమాచారం.. వాటి దిశని తెలుసుకునేలా ప్రత్యేక సాంకేతికత

త్వరలో జాతికి అంకితం చేయనున్న రక్షణ శాఖ

సాక్షి, విశాఖపట్నం: శత్రుదేశం ఎక్కుపెట్టిన క్షిపణి ఏదైనా సరే.. అదెక్కడ ఉంది.. ఎంత దూరంలో ఉంది.. దాన్ని ఛేదించేందుకు ఏం చేయాలనే వివరాల్ని రక్షణ రంగానికి చేరవేయగల సత్తాతో భారత్‌ అమ్ముల పొదిలో ‘ధ్రువ్‌’తార త్వరలో చేరబోతోంది. విభిన్న సాంకేతికతతో అత్యంత రహస్యంగా రూపొందించిన ఈ క్షిపణి (మిసైల్‌)గ్రాహక యుద్ధ నౌక త్వరలోనే భారత నౌకాదళంలో సేవలందించనుంది. విశాఖలోని హిందుస్థాన్‌ షిప్‌ యార్డు (హెచ్‌ఎస్‌ఎల్‌)లో రూ.1,500 కోట్ల వ్యయంతో ‘ఐఎన్‌ఎస్‌ ధ్రువ్‌’ రూపుదిద్దుకుంది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ సముద్ర నిఘా గూఢచారి నౌక వీసీ–11184ను నిర్మించారు. అనేక ప్రత్యేకతలు, శత్రు క్షిపణుల్ని గుర్తించగల అరుదైన సామర్థ్యం గల ఈ నౌకను రక్షణ శాఖ త్వరలోనే జాతికి అంకితం చేయనుంది.

అణు క్షిపణుల్ని సైతం..
ధ్రువ్‌.. అనేక మిషన్లను ఒంటిచేత్తో పూర్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్‌ నేవీ ఇంజినీర్లు, నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్‌టీఆర్‌వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్‌ షిప్‌యార్డు (హెచ్‌ఎస్‌ఎల్‌) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్‌తో పాటు ఇతర భూభాగాల నుంచి మిసైల్స్‌ ప్రయోగిస్తే.. వాటిని ధ్రువ్‌ ద్వారా ట్రాక్‌ చేయవచ్చు. వాటి లక్ష్యాన్ని అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఇది సులువుగా కనిపెట్టేస్తుంది. వీటిని ఏ ప్రాంతంలో ధ్వంసం చేస్తే.. దేశానికి మేలు జరుగుతుందన్న విస్తృత సమాచారాన్ని రక్షణ శాఖకు అందించగల సామర్థ్యం దీని సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్‌ మిసైల్స్‌ జాడల్ని కూడా సులభంగా గుర్తించేలా ధ్రువ్‌లో సాంకేతికతను అమర్చారు.

‘ఈసీజీ ఆఫ్‌ ఇండియన్‌ ఓషన్‌’
దేశం మొత్తం ఎప్పటికప్పుడు నిశిత పరిశీలన చేసే శాటిలైట్‌ మోనిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ నౌక నిర్మాణంతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్‌ చేరింది. ఇప్పటివరకూ ఈ తరహా టెక్నాలజీ నౌకలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌ దేశాలకు మాత్రమే ఉన్నాయి. అందుకే భారత నౌకాదళం ఈ ఇండియన్‌ జేమ్స్‌ బాండ్‌ యుద్ధనౌకను ‘ఈసీజీ ఆఫ్‌ ఇండియన్‌ ఓషన్‌’ అని పిలుస్తున్నారు.

దీని తయారీని 2015లో ప్రారంభించారు. 2020 అక్టోబర్‌లో నౌక నిర్మాణం పూర్తయింది. హిందుస్థాన్‌ షిప్‌యార్డులో నిర్మితమైన అతి భారీ నౌక ఇదే కావడం విశేషం. అత్యంత రహస్యంగా దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో సెన్సార్లతో కూడిన ‘త్రీ డోమ్‌ షేప్‌డ్‌ సరై్వలెన్స్‌ సిస్టమ్‌’ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్‌ ఎరే రాడార్స్‌ టెక్నాలజీ వినియోగించారు. దీని ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ను సైతం ఉత్పత్తి చేయొచ్చు. నౌక నిర్మాణం పూర్తయిన తర్వాత 6 నెలల పాటు రహస్యంగా షిప్‌యార్డు డ్రై డాక్‌లోనే ఉంచారు. ఇటీవలే ప్రయోగాత్మకంగా విధుల్లోకి తీసుకొచ్చారు. త్వరలోనే అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. 

మరిన్ని వార్తలు