ఏపీ గవర్నర్‌తో ఇండోనేషియా కాన్సుల్‌ జనరల్‌ భేటీ

4 Sep, 2021 14:46 IST|Sakshi
బిశ్వ భూషణ్‌ హరిచందన్ ( ఫైల్‌ ఫోటో )

రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చ

టోక్యో పారాలింపిక్స్‌ విజేతలను అభినందించిన గవర్నర్‌

సాక్షి, విజయవాడ: ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనో శనివారం రాజ్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్‌ హరిచందన్ను కలిశారు. మర్యాద పూర్వకంగా జరిగిన ఈ సమావేశంలో వీరిరువురు సమకాలీన అంశాలపై చర్చించారు. తొలుత రాజ్‌ భవన్‌కు విచ్చేసిన ఇండోనేషియా కాన్సుల్ జనరల్ (ముంబై) అగస్ పి. సప్టోనోకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్‌ హరిచందన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ పొడవైన తీరప్రాంతం, సమృద్ధిగా సహజ వనరులతో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని ఇండోనేషియా రిపబ్లిక్ కాన్సుల్ జనరల్‌కు వివరించారు. ఇక్కడి పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి ఇండోనేషియా నుంచి పెట్టుబడిదారులు రావచ్చని, రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలను అందిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. గవర్నర్ హరిచందన్ ఇండోనేషియా కాన్సుల్ జనరల్ అగస్ పి. సప్టోనోను జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (చదవండి: Andhra Pradesh: రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి)

టోక్యో పారాలింపిక్స్‌ పతక విజేతలకు గవర్నర్ అభినందన 
టోక్యో పారాలింపిక్స్‌లో మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతక విజేత మనీష్ నర్వాల్ , రజత పతక విజేత సింఘ్రాజ్ అధనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. మహిళల 50 మీటర్ల రైఫిల్  ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన అవని లేఖారాను అభినందించిన గవర్నర్ ఆమె ఇప్పటికే ఒక బంగారు పతకాన్ని సాధించారని ప్రశంసించారు. పారాలింపిక్ క్రీడల్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారని గవర్నర్ పేర్కొన్నారు.

పురుషుల వ్యక్తిగత ఆర్చరీ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించిన హర్విందర్ సింగ్‌ను కూడా గవర్నర్‌ బిశ్వ భూషణ్ అభినందించారు. దేశ ప్రజలు వారి విజయాలను చూసి గర్వపడుతున్నారని, భవిష్యత్తులో దేశానికి మరిన్ని పురస్కారాలు అందించేదుకు కృషి చేయాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్  ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
(చదవండి: పారాలింపిక్స్‌ పతకధారులకు రూ.10 కోట్ల భారీ నజరాన)

మరిన్ని వార్తలు