Vijayawada: ఉత్సవాలపై ‘పచ్చ’విషం

7 Oct, 2021 23:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు రోజుకో దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తున్న విపక్ష టీడీపీ చివరికి పవిత్ర ఉత్సవాలను సైతం విడిచి పెట్టలేదు. దసరా ప్రాశస్త్యం, భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అపచారానికి తెగించింది. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల కోసం అమ్మవారి ఆలయానికి చేసిన విద్యుద్దీపాలంకరణ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారానికి పాల్పడింది.  చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో కూడా విపక్షం ఇలా వ్యవహరించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్‌ చెక్‌ ఈ కుట్రను బట్టబయలు చేసింది.

మార్ఫింగ్‌ ఫొటోలతో దుష్ప్రచారం..
ఇంద్రకీలాద్రిపై విద్యుద్దీపాలంకరణ దృశ్యాలంటూ టీడీపీతోపాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు గురువారం ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో ప్రచారంలోకి తెచ్చాయి. కనకదుర్గమ్మ ఆలయం చుట్టూ కేవలం నీలం రంగు విద్యుద్దీపాలనే అలంకరించినట్లుగా ఆ ఫొటోలో ఉంది. ‘వైఎస్సార్‌ పార్టీ కార్యాలయం అనుకునేరు.. కాదు... విజయవాడ కనకదుర్గమ్మ గుడి’ అంటూ ఆ ఫొటోపై వ్యాఖ్యను జోడించింది. ఇంద్రకీలాద్రిని వైఎస్సార్‌సీపీ కార్యాలయంగా మార్చేశారంటూ సోషల్‌ మీడియాలో ఆ ఫొటోను వైరల్‌ చేశారు. 

వాస్తవం ఏమిటంటే...
ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ ఆలయంతోపాటు ఇంద్రకీలాద్రి మొత్తాన్ని రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించించింది. ఆలయ స్వర్ణ గోపురం శోభాయమానంగా భాసిల్లుతుండగా ప్రాకారం చుట్టూ అలంకరించిన విద్యుద్దీపాలు సప్తవర్ణ శోభితంగా కాంతులీనుతూ కన్నుల పండుగ చేస్తున్నాయి.

అన్ని రంగుల విద్యుద్దీపాలూ వరుస క్రమంలో(సీరియల్‌ లైట్లు) వెలుగుతూ సముద్రతీరంలో కెరటాలను తలపించే రీతిలో కాంతి తరంగాలను ప్రసరింపజేస్తూ అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శోభను కలిగిస్తున్నాయి. ఇందులో ఏ ఒక్క రంగూకు ప్రత్యేక ప్రాధాన్యమంటూ లేదు. ఏ ఒక్క రంగూ స్థిరంగా ఉండదు. అన్ని రంగుల్లోనూ విద్యుద్దీపాలు కాంతులీనుతూ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలను మరింత శోభాయమానం చేస్తున్నాయి. 

‘ఫ్యాక్ట్‌ చెక్‌’ ఏం తేల్చింది?
టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్‌ మీడియాలో ప్రచారంలోకి తెచ్చిన ఫొటోను గుర్తించిన కొందరు భక్తులు నిజానిజాలు తెలుసుకునేందుకు చొరవ చూపారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగానికి ఈ విషయాన్ని నివేదించడంతో వెంటనే స్పందించింది. ఫ్యాక్ట్‌చెక్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిశితంగా పరిశీలించగా అవి మార్ఫింగ్‌ చేసిన ఫొటోలని నిగ్గు తేలింది. ఇంద్రకీలాద్రిపై సీరియల్‌ లైట్లతో విద్యుద్దీపాలంకరణలో ఏ ఒక్క రంగుకూ ప్రాధాన్యమివ్వలేదని, సప్త వర్ణాల విద్యుద్దీపాలతో అలంకరించారని వెల్లడైంది. అదే విషయాన్ని పోలీసు శాఖ సోషల్‌ మీడియా వేదికల ద్వారా వెల్లడించింది. దుష్ప్రచారంపై విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు