పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ

5 Aug, 2020 03:23 IST|Sakshi
పారిశ్రామిక భద్రతపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ ఈ కొత్త పాలసీ కిందకు 

ఏడాదికి రెండుసార్లు కాంప్లియన్స్‌ నివేదికలు 

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు 

ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ.. థర్డ్‌ పార్టీ తనిఖీలు..

ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50లక్షల పరిహారం  

పారిశ్రామిక ప్రమాదాల నివారణపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా పారిశ్రామిక భద్రతా విధానాన్ని తీసుకురావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నింటినీ  ఈ విధానం కిందకు తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలని.. ఫ్యాక్టరీలపై బలమైన పర్యవేక్షణ యంత్రాంగం, థర్డ్‌ పార్టీ తనిఖీలు ఉండాలని సీఎం స్పష్టంచేశారు. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చేలా కొత్త విధానంలో పొందుపరచాలన్నారు. పారిశ్రామిక ప్రమాదాల నివారణ చర్యలపై సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పరిశ్రమల్లో భద్రత, ప్రమాదాలు, కాలుష్య నివారణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం జగన్‌ ఆదేశాలిలా ఉన్నాయి..

► కొత్తగా ఇండస్ట్రియల్‌ సేఫ్టీ పాలసీ తీసుకురావాలని అధికారులు ప్రతిపాదించగా.. పరిశ్రమల భద్రత కోసం ప్రస్తుతమున్న రెగ్యులేటరీ వ్యవస్థలన్నీ కూడా ఈ సేఫ్టీ పాలసీ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే..
► రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఇండస్ట్రియల్‌ పార్కులను సూచిస్తూ ఇండస్ట్రియల్‌ అట్లాస్‌ రూపొందించాలి.
► ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పరిశ్రమలు ఉన్నాయన్న వివరాలు అట్లాసులో పొందుపరచాలి. 
► పరిశ్రమలు ఏర్పాటుచేయాలనుకునే వారు కూడా.. కేటగిరీ ప్రకారం ఎక్కడ ఏర్పాటుచేసుకోవాలో నిర్ణయించుకునేలా వివరాలుండాలి. 
► పరిశ్రమలు కాంప్లియన్స్‌ (సమ్మతి) నివేదికలను ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా చూడాలి.
► వీటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నామన్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డులపై ప్రదర్శించాలి. థర్డ్‌ పార్టీ తనిఖీలు కూడా వీటిపై ఉండాలి.
► కేవలం పరిశ్రమల్లోనే కాకుండా ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కూడా నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? చూడాలి.
► పర్యవేక్షణ యంత్రాంగం బలంగా ఉండాలి.
► విశాఖ గ్యాస్‌ దుర్ఘటనలో నిరోధకాలు ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదు. ఎవ్వరూ పర్యవేక్షణ చేయకపోవడంవల్లే ఈ సమస్య వచ్చింది.
► పాశ్చాత్య దేశాల్లో కాంప్లియన్స్‌ నివేదిక ఇవ్వకపోతే భారీ జరిమానాలు వేస్తారు. కానీ, మన దగ్గర అలాంటి పరిస్థితిలేదు. మనం కూడా ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండాలి.
► పారిశ్రామిక ప్రమాదాలకు బాధ్యులైన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని.. రెండు, మూడు నెలల్లో వీటిని పూర్తిచేస్తామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. సమీక్షలో పర్యావరణ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా ఇతర అధికారులు పాల్గొన్నారు. 

పరిశ్రమల్లో ప్రత్యేక తనిఖీలు
రాష్ట్రంలో పరిశ్రమల్లో సురక్షిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్పెషల్‌ డ్రైవ్‌(ప్రత్యేక తనిఖీ) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం జాయింట్‌ కలెక్టర్‌ అధ్యక్షతన పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్, బాయిలర్స్‌ విభాగం ఇన్‌స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి ఆర్వో, డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అధికారి సభ్యులుగా జిల్లా స్థాయి కమిటీని నియమించింది. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. పరిశ్రమల్లో 90 రోజుల్లోగా స్పెషల్‌ డ్రైవ్‌ను పూర్తి చేసి.. ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని ఆదేశిస్తూ మంగళవారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

► ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాద ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీ ఇచ్చిన నివేదిక, జూన్‌ 8న ఎన్జీటీ జారీచేసిన మార్గదర్శకాల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 
► పరిశ్రమలను నాలుగు విభాగాలుగా వర్గీకరించాలి. 1.విష, ప్రమాదకర రసాయనాల తయారీపరిశ్రమలు 2.ప్రమాదకర విష పదార్థాలు నిల్వ చేసే పరిశ్రమలు. 3.పేలుడు స్వభావం ఉన్న పదార్థాలను నిల్వ చేసి, వాటిని తయారు చేసే పరిశ్రమలు 4.ఈ మూడు కేటగిరీల్లోని పరిశ్రమలు.. వీటిని జిల్లా స్థాయి కమిటీలు 
విధిగా తనిఖీ చేయాలి. 

మరిన్ని వార్తలు