‘లాజిస్టిక్స్‌’కు పరిశ్రమ హోదా

15 May, 2022 05:12 IST|Sakshi

ఈజీ పాలసీ ద్వారా చౌక రవాణా లక్ష్యం

ప్రస్తుతం రాష్ట్రంలో వేర్‌హౌసింగ్‌ సామర్థ్యం 13.38 లక్షల టన్నులు

ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణతో ఈ మొత్తాన్ని 56 లక్షల టన్నులకు పెంచాలన్నది లక్ష్యం

శీతల గిడ్డంగుల సామర్థ్యం కూడా పెంపు

రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.20,000 కోట్లు వ్యయం చేయనున్న మారిటైమ్‌ బోర్డు

రోడ్డు, రైలు, జలరవాణా ద్వారా పారిశ్రామిక పార్కులు, పోర్టుల అనుసంధానం

కొత్తగా వచ్చే పారిశ్రామిక పార్కుల్లో 5 శాతం భూమి లాజిస్టిక్‌ రంగానికి కేటాయింపు

ఏపీ లాజిస్టిక్‌ 2022–27 ముసాయిదా పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి: సరుకు రవాణాలో కీలకమైన లాజిస్టిక్‌ రంగానికి పరిశ్రమ హోదాను కల్పిస్తూ ఇందులోకి భారీగా ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ లాజిస్టిక్‌ పాలసీ 2022–27ను రూపొందించింది. రాష్ట్రం మీదుగా వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులను అనుసంధానిస్తూ లాజిస్టిక్‌ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ పాలసీలో పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్‌ రంగంలో చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను ఈ ముసాయిదా పాలసీలో పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో మొదటిస్థానంలో ఉన్న రాష్ట్రం.. రవాణాను చౌకగా అందించడం ద్వారా లాజిస్టిక్‌ రంగంలోనూ మొదటిస్థానంలో ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

గోడౌన్ల సామర్థ్యం నాలుగురెట్లు పెంపు
లాజిస్టిక్‌ రంగంలో కీలకమైన గోడౌన్ల సామర్థ్యాన్ని ప్రభుత్వం పాలసీ కాలపరమితిలోగా నాలుగు రెట్లు పెంచనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13.38 లక్షల టన్నులుగా ఉన్న గోడౌన్ల సామర్థ్యాన్ని 2027 నాటికి 56 లక్షల టన్నులు చేయనుంది. ముఖ్యంగా విజయవాడ, కాకినాడ, నెల్లూరు వంటి పట్టణాల్లో డిమాండ్‌ అధికంగా ఉందని.. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించాలని ప్రభుత్వం  భావిస్తోంది. అలాగే.. ఆక్వా, హార్టికల్చర్‌ రంగాల ఎగుమతులు పెరుగుతుండటంతో శీతల గిడ్డంగుల డిమాండ్‌ కూడా భారీగా పెరుగుతోంది. దీంతో.. ప్రస్తుతం రాష్ట్రంలో 15.67 లక్షల టన్నుల సామర్థ్యం గల శీతల గిడ్డంగులు మాత్రమే ఉన్నాయి. అపెడా, ఎంపెడా సహకారంతో ఈ రంగంలో భారీగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకూ ప్రణాళికలను సిద్ధంచేసింది. వీటితో పాటు ఇన్‌లాండ్‌ కంటైనర్‌ స్టోర్లు, ఫ్రీ ట్రేడ్‌వేర్‌ హౌసింగ్‌ జోన్లు వంటి సౌకర్యాలను ప్రోత్సహించనుంది.

పోర్టులపై భారీ పెట్టుబుడులు
మరోవైపు.. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్‌ బోర్డు రూ.20,000 కోట్ల వరకు వ్యయం చేయనుంది. ఇదే సమయంలో ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ ద్వారా సరుకు రవాణాను 5 టన్నుల నుంచి 10 టన్నులకు పెంచనుంది. అలాగే, విశాఖ భోగాపురం వద్ద 2,203 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, నెల్లూరు దగదర్తి వద్ద 1,868 ఎకరాల్లో సరకు రవాణా లక్ష్యంగా మరో ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఇక కంటైనర్లు వేగంగా ప్రయాణించేందుకు జాతీయ రహదారులను భారీగా విస్తరించడంతో పాటు 16, 65, 48, 44 జాతీయ రహదారుల పక్కన ట్రక్కులు నిలుపుకోవడానికి ట్రక్‌ పార్కింగ్‌ బేలను అభివృద్ధి చేయనుంది.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థలాలను గుర్తించింది. ఇక్కడ డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, రిపేర్లు, ఇంథనం నింపుకోవడం వంటి మౌలిక వసతులూ కల్పిస్తారు. కేవలం సరుకు రవాణా కోసం ఖరగ్‌పూర్‌–విజయవాడ (1,115 కి.మీ), విజయవాడ–నాగపూర్‌–ఇటార్సి (975కి.మీ)లను డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేస్తోంది. అలాగే,  ప్రధాన పారిశ్రామికవాడలైన కొప్పర్తి, ఓర్వకల్లు, శ్రీకాళహస్తిలను రైల్వేలైన్లతో అనుసంధానం చేస్తోంది.

ఎంఎంఎల్‌పీల అభివృద్ధి
ఒక వస్తువు ధరలో 13 శాతంగా ఉన్న సరుకు రవాణా వ్యయాన్ని మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు ద్వారా 8 శాతానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం..
► కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రం, ప్రైవేటు రంగంలో వాటిని అభివృద్ధి చేయనున్నారు.
► ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విశాఖ, అనంతపురంలలో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయనుండగా, వైఎస్సార్‌ జిల్లా కొప్పర్తి వద్ద మరో ఎంఎంఎల్‌పీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. 
► వీటితో పాటు పారిశ్రామికవాడల్లో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేసి నిర్వహించుకోవడానికి ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలను ఏపీఐఐసీ ఆహ్వానిస్తోంది. 
► అలాగే, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులతో పాటు ఓర్వకల్లు, హిందూపురం, దొనకొండ, ఏర్పేడు–శ్రీకాళహస్తి నోడ్‌ల వద్ద ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలనూ సిద్ధంచేస్తోంది. 
► ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కుల్లో 5 శాతం భూమిని ఎంఎంఎల్‌పీలకు కేటాయించడమే కాకుండా 2020–23 పారిశ్రామిక పాలసీ ప్రకారం ఇతర రాయితీలను అందించనుంది.

ప్రతీ 50–60 కి.మీ ఒక పోర్టు
ప్రస్తుతం విశాఖ మేజర్‌పోర్టుతో కలిపి ఆరు పోర్టుల కార్యకలాపాలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా నిర్మించనున్న భావనపాడు, కాకినాడ సెజ్, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులతో మొత్తం పోర్టుల సంఖ్య 10కి చేరుతుంది. ఇలా ప్రతీ 50–60 కి.మీ.కు ఒక పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి అనుగుణంగా సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు లాజిస్టిక్‌ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ లాజిస్టిక్‌ ప్రమోషన్‌ పాలసీ–2022–27ను తీసుకొస్తున్నాం.
– గుడివాడ అమరనాథ్, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

మరిన్ని ఎంఎంఎల్‌పీల అభివృద్ధికి ప్రణాళిక
సరుకు రావాణా వ్యయంలో లాజిస్టిక్స్‌ చాలా కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని విశాఖ, అనంతపురంలో ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేస్తున్నాం. వీటితో పాటు రాష్ట్రంలో మరిన్ని మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధంచేస్తున్నాం.
– కరికల్‌ వలవన్, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

రాష్ట్రంలో లాజిస్టిక్స్‌ గణాంకాలు..
► రాష్ట్రంలో రహదారుల దూరం : 13,500 కి.మీ 
► జాతీయ రహదారుల్లో 7 శాతం వాటాతో వాటి దూరం : 7,340 కి.మీ
► మన రాష్ట్రంలో రైల్వే లైన్ల దూరం : 7,715 కి.మీ
► ఏపీలో వేర్‌ హౌసింగ్‌ గిడ్డంగుల సామర్థ్యం : 13.38 లక్షల టన్నులు
► శీతల గిడ్డంగులవి : 15.67 లక్షల టన్నులు
► కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్లు మొత్తం : 17 
► ఇన్‌లాండ్‌ కంటైనర్‌ డిపోలు (ఐసీడీఎస్‌) : 3 
► ఎయిర్‌ కార్గో టెర్మినల్స్‌ : 5 
► రైల్‌–రోడ్‌ గూడ్స్‌ షెడ్లు : 283 
► లాజిస్టిక్‌ ట్రైనింగ్‌ సెంటర్లు : 16 
► మన పోర్టుల సరుకు నిర్వహణ సామర్థ్యం : 172 మిలియన్‌ టన్నులు  

మరిన్ని వార్తలు