ఆన్‌లైన్‌లో నోటరీల సమాచారం

1 Mar, 2023 04:27 IST|Sakshi

నోటరీల సమస్త సమాచారం ఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో

సొసైటీలు, ఫర్మ్‌ రిజిస్ట్రేషన్ల సేవల ఆధునీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నోటరీల వివరాలు ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందుకోసం నోటరీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. నోటరీల ఫొటోలు, అడ్రస్, లొకేషన్లతో పాటు వారు ఎంతకాలం నుంచి ఉంటున్నారు, రెన్యువల్‌ అయ్యారా? లేదా (ఫోర్స్‌లో ఉన్నారా? లేదా?) వంటి వివరాలని్నంటినీ త్వరలో వెబ్‌సైట్‌లో చూసుకునే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా ఎవరికీ నోటరీని ఇచ్చే అవకాశం లేదు. జనాభానుబట్టి కేంద్రం రాష్ట్రాలకు నోటరీలు కేటాయిస్తుంది. రాష్ట్రానికి ఇచ్చిన కోటా గతంలోనే పూర్తయింది. ఉన్న నోటరీలను ఐదేళ్లకోసారి రెన్యువల్‌ చేస్తారు. మొదటి రెన్యువల్‌ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ, రెండో రెన్యువల్‌ను కమిషనర్‌ అండ్‌ ఐజీ, మూడు ఆ తర్వాత జరిపే రెన్యువల్స్‌ను ప్రభుత్వం చేస్తుంది. ఎక్కువ మంది నోటరీలు ఫోర్స్‌లో ఉన్నారా లేదా అనే విషయం ప్రజలకు తెలియడంలేదు.

ఫోర్స్‌లో లేకపోయినా చాలామంది నోటరీలు చేస్తుండటంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరిచి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. మరోపక్క సొసైటీలు, ఫర్మ్‌ రిజిస్ట్రేషన్ల సేవలను కూడా ఆన్‌లైన్‌లో ఆధునీకరిస్తున్నారు. జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి మళ్లీ ప్రారంభిస్తున్నారు. 

మరిన్ని వార్తలు