జగనన్న కాలనీల్లో  మౌలిక వసతులు అదుర్స్

5 Apr, 2021 03:15 IST|Sakshi

సీఎం ఆదేశాలతో రీ డిజైన్‌.. శాఖల వారీగా అంచనాలు 

20 అడుగుల నుంచి 60 అడుగుల రహదారులు

సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, నీటి సరఫరా, ఎలక్ట్రిఫికేషన్‌ 

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇంటర్నెట్, మొక్కల పెంపకం

సామాజిక మౌలిక వసతులకు మరో రూ.2,715 కోట్లు  

మౌలిక వసతుల కల్పనకే రూ.30,958 కోట్లు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ – జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో మధ్య తరగతి కాలనీల స్థాయిలో మౌలిక వసతులు కల్పించే దిశగా కార్యాచరణ సిద్ధమైంది. ఈ విషయంలో రాజీ పడేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కాలనీల్లో ఇరుకు రహదారులు, మొక్కుబడిగా మౌలిక వసతులు కల్పించి చేతులు దులుపుకుంటే కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీంతో మధ్యతరగతి ప్రజల కాలనీల్లో ఏ స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తున్నారో అదే స్థాయిలో ఈ కాలనీల్లో కూడా మౌలిక వసతుల కల్పనకు శాఖల వారీగా ప్రాథమిక అంచనాలను సిద్ధం చేశారు. పేదల కాలనీల్లో తొలుత 20 అడుగుల్లోపు రహదారులను అధికారులు ప్రతిపాదించగా ముఖ్యమంత్రి తిరస్కరించారు. ఓపెన్‌ ఏరియా 13 శాతం ఉండాల్సిందేనని ఆదేశించారు. దీంతో 20 అడుగుల నుంచి 60 అడుగుల వరకు రహదారుల నిర్మాణానికి, కాలనీల్లో 13 శాతం మేర ఓపెన్‌ స్పేస్‌కు అదనంగా అవసరమైన భూ సేకరణకు అధికారులు చర్యలను చేపట్టారు. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీతో పాటు వర్షపు నీరు కూడా వెళ్లేలా  నిర్మాణాలు ఉండాలని, ఫుట్‌పాత్‌పై టైల్స్‌ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. 

అదనంగా 950 ఎకరాలు అవసరం
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రహదారుల సైజు పెంచడం, ఓపెన్‌ ఏరియా 13 శాతం మేర ఉంచేందుకు చర్యలు తీసుకోవడం వల్ల అదనంగా 950 ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేయడంతో పాటు ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు గృహ నిర్మాణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌–జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో ఏకంగా 11,412 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ రహదారుల వెంబడే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీతో పాటు అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్, ఎలక్ట్రిఫికేషన్‌ కేబుల్స్‌ రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17,005 వైఎస్సార్‌–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలను రెండు దశల్లో చేపట్టనున్న విషయం తెలిసింది. ఈ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.30,958 కోట్లు వ్యయం అవుతుంది. ఇందుకు అదనంగా సామాజిక మౌలిక వసతుల కల్పనకు మరో రూ.2,715 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. 

మధ్యతరగతి కాలనీలకు ఏమాత్రం తీసిపోవు
మధ్యతరగతి ప్రజల కాలనీలకు తీసిపోని స్థాయిలో వైఎస్సార్‌–జగనన్న పేదల ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పన ఉండాల్సిందేనన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రహదారులు, ఓపెన్‌ ఏరియా, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇంటర్నెట్, ఎలక్ట్రిఫికేషన్‌ రీ–డీజైన్‌ చేశాం. శాఖల వారీగా ప్రాథమిక అంచనాలను రూపొందించాం. ఇందులో ఇంకా మార్పులు జరిగే అవకాశం ఉంది. కాలనీల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా, అత్యంత నాణ్యతతో పనులు చేపడుతున్నాం.   
– అజయ్‌ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్‌  

మరిన్ని వార్తలు