అనర్హతపై జాప్యంతో అన్యాయం 

24 Jun, 2021 04:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ పేర్కొంది. ఈమేరకు పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి బుధవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు. అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో అసాధారణ జాప్యం జరుగుతున్నందున అర్హత లేని వ్యక్తి ప్రాతినిథ్యం వహించడం ద్వారా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. లేఖలో వివరాలివీ..
 
2020 జూలై 3న అనర్హత పిటిషన్‌ ఇచ్చాం.. 
నాతో పాటు పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి బృందం 2020 జులై 3న మిమ్మల్ని (లోక్‌సభ స్పీకర్‌) కలసి రఘురామకృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్‌ సమర్పించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం పిటిషన్‌ సమర్పించాం. గౌరవ సభాపతిని స్వయంగా కలిసి ఇచ్చినందున పిటిషన్‌ను పద్ధతి ప్రకారమే సమర్పించామని భావించాం. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ సభ్యులు మిమ్మల్ని పలుమార్లు కలిసి వేగంగా పరిష్కరించాలని కోరారు. సమయానుసారం చర్యలు తీసుకుంటామని అనేక సందర్భాల్లో మీరు హామీ ఇచ్చారు. జూన్‌ 11, 2021న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ విప్‌ మిమ్మల్ని స్వయంగా మీ నివాసంలో కలిసి పిటిషన్‌ను పరిష్కరించాలని కోరారు. జూన్‌ 17న పార్టీ లోక్‌సభాపక్ష నేత మిమ్మల్ని స్వయంగా కలసి రఘురామకృష్ణరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తగిన సాక్ష్యాలతో లేఖను మీకు అందజేశారు. 2020 జూలై 3 నాటి అనర్హత పిటిషన్‌ను పరిష్కరించాలని అభ్యర్థించారు. 

11 నెలల తరువాత సవరించాలని సూచనా? 
పిటిషన్‌ దాఖలు చేసిన తరువాత 11 నెలలు గడిచిన తరువాత మీ కార్యాలయం నుంచి జవాబు వచ్చింది. పిటిషన్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి కాకుండా పిటిషన్‌ను సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ 1908 ప్రకారం సవరించాలని అందులో పేర్కొన్నారు. తర్కబద్ధంగా పరిశీలిస్తే ఈ జవాబు క్లరికల్‌ జవాబు. పార్లమెంట్‌ రెండు సెషన్లు పూర్తయిన తరువాత కాకుండా ఆ విషయాన్ని మా పరిశీలనకు ఎప్పుడో తీసుకురావాల్సింది. పిటిషన్‌లో ఏవైనా లోపాలు ఉంటే దాఖలు చేసిన పార్టీ దృష్టికి చాలా ముందుగానే తీసుకురావాల్సింది. ఏమైనప్పటికీ మీ కార్యాలయం లేఖలో సూచించిన వివరాలన్నింటితో మరో తాజా పిటిషన్‌ను సమర్పిస్తాం. 

దురదృష్టకరం: నిబంధనలు, దక్షత విషయంలో సభాపతి కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఆదర్శంగా ఉంటుందని పరిగణించాల్సిన పరిస్థితుల్లో అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవాలని  అనేకమార్లు కోరాల్సి రావడం దురదృష్టకరం.

సుప్రీం తీర్పునకు విరుద్ధం.. 
మేం సమర్పించబోయే తాజా అనర్హత పిటిషన్‌ను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతున్నాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయినందున దీనిపై స్వయంగా దృష్టి పెట్టాలి. ఒక పార్లమెంటు సభ్యుడు చట్టబద్ధంగా, నైతికంగా, ప్రవర్తనాపరంగా సభలో ఉండాల్సిదగిన వ్యక్తి కానప్పుడు సభకు హాజరుకానివ్వడం వాంఛనీయం కాదు. చర్యలు తీసుకోవడంలో చోటు చేసుకునే అసాధారణమైన జాప్యం.. కె.మేఘచంద్ర సింగ్‌ వర్సెస్‌ మణిపూర్‌ అసెంబ్లీ స్పీకర్‌ కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పునకు విరుద్ధం అవుతుంది. ఇలాంటి అనర్హత పిటిషన్లను పరిష్కరించేందుకు మూడు నెలల సమయాన్ని ఆ తీర్పులో సుప్రీం కోర్టు నిర్దేశించింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు