Innovative Awareness Program: యువతను మేల్కోల్పేందుకు... యాష్‌ట్రేల ప్రదర్శన

31 May, 2022 10:14 IST|Sakshi

మద్దిలపాలెం (విశాఖతూర్పు) : ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా మానడం లేదు. పొగచూరిపోతున్న యువతరాన్ని మేల్కోపేందుకు ఓ విశ్రాంతి ఉద్యోగి వినూత్న ప్రయాత్నానికి శ్రీకారం చుట్టారు. పూర్వం ధూమపానం ప్రియు లు వినియోగించే యాష్‌ ట్రేలను సేకరించి వాటిని ప్రతి ఏడాది పొగాకు రహిత దినోత్సవం నాడు ప్రదర్శిస్తున్నారు. పొగాకు వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నట్టు జేఆర్‌నగర్‌ కాలనీకి చెందిన విశ్రాంత జిల్లా సహకార బ్యాంకు మేనేజర్‌ జి.ఎస్‌.శివప్రకాష్‌ చెప్పారు. సోమవారం తన నివాసంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. యాష్‌ ట్రేలు వారి వ్యసనానికి సాక్షిగా నిలిచాయని నేటి తరానికి తెలియజేయడమే తన ఉద్దేశమన్నారు. ధూమపానం వలన పర్యావరణానికి ఎంతో చేటు కలుగుతుందని ఆ వ్యసానానికి దూరంగా యువతరం ఉండేలా తన వంతు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు.   

పొగాకు నిర్మూలనతోనే వ్యాధుల నివారణ
ఎంవీపీకాలనీ: పొగాకు నిర్మూలనతోనే నేడు సమాజాన్ని పీడిస్తున్న అనేక వ్యాధులకు నివారణ సాధ్యమవుతుందని మహాత్మగాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని డబ్లుహెచ్‌ఓ ఈ ఏడాది నినాదం ‘పర్యావరణం కాపాడుదాం’ అంశంపై ఆయన సోమవారం ఎంవీపీ కాలనీలోని ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. సమాజంలో సంభవిస్తున్న ఎక్కువ వ్యాధులకు, మరణాలకు పొగాకే కారణంగా నిలుస్తోందన్నారు. క్యాన్సర్, గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్స్, ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులు ప్రస్తుతం ఎక్కువ అవుతున్నాయన్నారు.

దీంతో పాటు సిగరెట్‌ పీకలలో వాడే మైక్రో ప్లాస్టిక్, నాన్‌ బయోడిగ్రేడబుల్‌ పౌచ్‌ల ద్వారా మట్టి పెద్ద ఎత్తున కలుషితం అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నినాదం పర్యావరణం కాపాడుదాం విజయవంతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలన్నారు.  దేశంలో పొగాకు ఉత్పత్తుల అమ్మకం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.18 వేల కోట్లు ఆదాయం వస్తుండగా వాటి వినియోగించడం ద్వారా వ్యాధుల భారిన పడుతున్న వారి చికిత్సకు రూ.లక్ష కోట్లు ఖర్చువుతుందన్నారు. 

క్యాన్సర్‌ మరణాలు అయితే 20శాతానికి పైగా పొగాకు వాడకం ద్వారానే వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పొగాకు నిర్మూలపై ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పొగాకు పండించే రైతులకు పత్యామ్నాయమార్గాలు చూపించడం, పొగాకు వాడకం ద్వారా వచ్చే నష్టాలపై ప్రజలను పెద్ద ఎత్తున చైతన్యవంతం చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. సామాజిక బాధ్యతలో భాగంగా మహాత్మాగాంధీ క్యాన్సర్‌ ఆస్పత్రి తరఫున ఏటా పదుల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామీణ ప్రజలను పొగాకు రహిత జీవనంపై చైతన్యం కలిగిస్తున్నట్లు తెలిపారు.   
-ఎంజీ క్యాన్సర్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ మురళీకృష్ణ  

(చదవండి: ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు)

మరిన్ని వార్తలు