నూతన వధువరుల వినూత్న ఆలోచన.. కుటుంబాలను ఒప్పించి..

28 Dec, 2022 08:29 IST|Sakshi
నూతన వధూవరులు సతీశ్‌కుమార్, సజీవరాణి

నిడదవోలు(తూర్పుగోదావరి): పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. తన పెళ్లి సందర్భంగా అవయవ దానంపై అందరి దృష్టి పడేలా చేసి అవగాహన కల్పించాలనుకున్నాడు. కాబోయే భార్యతో ఈ విషయం పంచుకున్నాడు. ఆమె సరే అంది. ఇంకేముంది తమతోపాటు ఓ సామాజిక బాధ్యతకూ పెళ్లిరోజున పెద్దపీట వేసేందుకు ముహూర్తం పెట్టుకున్నాడు.

ఇరువురూ పెద్దలు ముందుకు రావడంతో 60 మంది అవయవదాన హామీ పత్రాలను ఇచ్చే ఘట్టానికి నిడదవోలులో వివాహ వేడుక వేదిక కానుంది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీశ్‌కుమార్‌ చిన్నప్పటి నుంచి పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. దొమ్మేరు గ్రామానికి చెందిన యువతి సజీవ రాణితో ఇటీవల ఇతనికి పెళ్లి కుదిరింది. వివాహం రోజున సతీశ్‌ కుమార్‌ తనతో పాటు బంధువులు, స్నేహితులు కలసి ఇచ్చే అవయవ దాన హమీ పత్రాలే తన వివాహానికి పెద్ద బహుమానమని చెప్పాడు. వారంతా ఇందుకు అంగీకరించారు.

కాబోయే జీవిత భాగస్వామి కూడా సతీష్‌ ఆలోచనను మెచ్చుకుంది. తాను కూడా అవయవదాన హామీ పత్రం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. నిడదవోలులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కల్యాణ మండపంలో గురువారం ఈ నవ దంపతుల వివాహ వేడుక జరుగుతుంది.  60 మంది అవయవదాన హామీ పత్రాలు ఇవ్వడానికి ముందుకు రావడంపై సావిత్రీబాయి ఫూలే ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు చైర్‌పర్సన్‌ గూడూరు సీతామహలక్ష్మి (విశాఖపట్నం) సంతోషం వ్యక్తం చేశారు.

ఆమె స్వయంగా పెళ్లికి హాజరై అవయవదాన హామీ పత్రాలు స్వీకరించనున్నారు. పెళ్లి పత్రికలో అవయవదానం చేయండి–ప్రాణదాతలు కండి అని ముద్రించడం అందరినీ ఆలోచింపజేసింది. అవయవదాన ఆవశ్యకతను విస్త్రతంగా ప్రచారం చేస్తున్న కొత్త దంపతులను పలువురు అభినందిస్తున్నారు.
చదవండి: కథ.. ​స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే..

ఓ బాలుడి మరణం కదిలించింది 
వేలివెన్నులో పదేళ్ల బాలుడు కిడ్నీ పనిచేయక చనిపోయాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స దశలో బాధిత బాలుడికి కిడ్ని దానం చేయడానకి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ బాలుడు చనిపోయాడు. ఈ విషయం తెలిసి చాలా బాధ పడ్డాను. అప్పటి నుంచి అవయవదానం అవసరాన్ని గ్రహించాను. చేతనైన మేర దీనిపై ప్రచారం చేస్తున్నాను. నాపెళ్లి శుభలేఖలో కూడా ఇదే అంశాన్ని నినాదంగా ప్రచురించాను. కాబోయే భార్య సజీవరాణికి చెప్పగానే పెద్ద మనసుతో అంగీకరించింది. ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు నా స్నేహితులు 60 మంది అవయవదాన హామీపత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
– సతీశ్‌కుమార్, వేలివెన్ను, ఉండ్రాజవరం మండలం

ఆయన ఆలోచన నచ్చింది 
నిశ్చితార్థానికి ముందు సతీశ్‌కుమార్‌ అవయవదానం గురించి చెప్పారు. ఇంత మంచి సేవా కార్యక్రమానికి వివాహం వేదిక కావడం సంతోషం అనిపించింది. అవయవదానంపై మా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు.  వారంతా అవయవదానానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో అవయవదానంపై ఇద్దరం కలిసి ప్రచారం చేస్తాం.
– సజీవరాణి, దొమ్మేరు, కొవ్వూరు మండలం  

మరిన్ని వార్తలు