ఊరికి ‘భరోసా’

16 Nov, 2020 02:21 IST|Sakshi

గ్రామ వికాసానికి కృషి చేసేలా ‘రైతు భరోసా కేంద్రాలు’

ఆర్బీకేల పరిధిలో వినూత్న సేవలు

కొత్తగా 9,899 పాల సేకరణ కేంద్రాల నిర్మాణానికి అనుమతి

ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు

మంచి రేటు వచ్చేవరకు పంటను నిల్వ చేసేలా గోదాములు

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా అద్దెకు యంత్ర పరికరాలు

ఈ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫారాలతో రైతన్న ఇక రాజే  

సాక్షి, అమరావతి: విత్తనం నుంచి పంట విక్రయం దాకా అన్నదాతలకు అన్ని రకాలుగా అండగా నిలిచి అమిత ఆదరణ పొందుతున్న రైతు భరోసా కేంద్రాలు గ్రామ వికాసానికి పూర్తి స్థాయిలో దోహదం చేసేలా సిద్ధమవుతున్నాయి. రైతులకే కాకుండా గ్రామం అంతటికీ అన్ని రకాలుగా భరోసా ఇచ్చేలా వీటిని తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్తగా 9,899 పాల సేకరణ కేంద్రాల భవన నిర్మాణాలకు అనుమతిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రతి గ్రామంలో ఆర్బీకేలకు అనుబంధంగా పాలసేకరణ కేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

భవనాల నిర్మాణం పూర్తి కాగానే వీటిని పొదుపు సంఘాల మహిళలకు అప్పగించనున్నారు. రైతులు పండించిన పంటలకు మంచి ధరలు లభించేలా ఆర్బీకేల పరిధిలో పలు సదుపాయాలు కలిగిన మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను యుద్దప్రాతిపదిక అందుబాటులోకి తేవాలని ఇటీవల సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. రూ.9,104 కోట్ల వ్యయంతో ఇవి ఏర్పాటు కానున్నాయి. ప్రధానంగా గోడౌన్లు, కోల్డ్‌ రూమ్‌లు, ఆక్వా మౌలిక సదుపాయాలు, పాల సేకరణ కేంద్రాలు.. బీఎంసీలు (బల్క్‌మిల్క్‌ సెంటర్లు), కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఈ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫారాలు, జనతా బజార్లు తదితరాలు మల్టీ పర్పస్‌ కేంద్రాల్లో ఏర్పాటవుతాయి. 

గోడౌన్లు, కోల్డు రూమ్‌లు...
రాష్ట్రంలో 10,641 ఆర్బీకేల పరిధిలో గ్రామస్థాయిలో ఒక్కొక్కటి రూ.30 లక్షల వ్యయంతో, 500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యంతో కొత్తగా గోడౌన్లు ఏర్పాటవుతాయి. మంచి ధరల లభించే వరకు రైతులు వీటిల్లో పంటను నిల్వ చేసుకోవచ్చు. ఇందుకు రూ.2,706 కోట్లను నాబార్డు సమకూర్చనుండగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పర్యవేక్షణలో వీటి నిర్మాణాలు కొనసాగుతాయి.

ఆక్వా మౌలిక సదుపాయాలు..
మత్స్యరంగాన్ని ఆధారంగా చేసుకుని వ్యాపారాలు, వ్యాపకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఎఫ్‌ఎఫ్‌పీవో (ఫిష్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్స్‌) లను ఏర్పాటు చేస్తోంది. వీటికి రాయితీతోపాటు నామమాత్రపు వడ్డీతో రుణ సౌకర్యాన్ని కల్పించనుంది. చేపలు, రొయ్యలు సాగుకు రాయితీ అందించనుంది. ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుకు రూ.698.27 కోట్లు వ్యయం కానుందని అంచనా.

కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు..
గ్రామ స్థాయిలో ఏర్పాటయ్యే దాదాపు 10,500 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ద్వారా యంత్ర పరికరాలను రైతులకు అద్దెకు ఇస్తారు. ఐదుగురు సభ్యులు కలిగిన గ్రూపులకు వీటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తారు. 

ఊరూరా పాల సేకరణ కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా 9,899 పాల సేకరణ కేంద్రాల భవనాల నిర్మాణానికి అనుమతిస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో పునాది కోసం అత్యధికంగా ఖర్చు చేయాల్సిన  చోట ఒక్కో భవనానికి రూ.18.04 లక్షల చొప్పున, మిగిలిన ప్రాంతాల్లో రూ.15.74 లక్షల చొప్పున వ్యయంతో వీటి నిర్మాణం చేపడతారు.

వీటి నిర్మాణం కోసం సుమారు రూ.1,682 కోట్లు వ్యయం కానుండగా 90 శాతం మేర  ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల నుంచి వినియోగిస్తారు. మరో 10 శాతం రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిధుల నుంచి వెచ్చిస్తారు. నిర్మాణ పనులు పూర్తి కాగానే పొదుపు సంఘాల మహిళలకు ఈ భవనాలను అప్పగిస్తారు. అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌)తో ఎంవోయూ మేరకు వీటిని దశలవారీగా బల్క్‌మిల్క్‌ సెంటర్లుగా మారుస్తారు. ఈ నెలలోనే ఒంగోలు, మదనపల్లి డైరీల ద్వారా పాలసేకరణ, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.

రైతు ఊరు దాటకుండా..
– ఎస్‌.ప్రద్యుమ్న, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ 
‘రైతు తన ఊరు దాటాల్సిన పనిలేకుండా ఈ–మల్టీపర్పస్‌ ఫెసిలిటీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి విత్తనం నుంచి పంటల సేకరణ, గోదాములు, అద్దెకు యాంత్రిక పరికరాలు లాంటి పలు సేవలు లభిస్తాయి. దేశంలో ఎక్కడా ఈ విధానం లేదు. దూరదృష్టితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విధానాలు అన్నదాలకు ఎంతో మేలు చేకూర్చుతాయి’

మల్టీపర్పస్‌ సెంటర్లు ఇలా.. 

ఇంటి నుంచే పంట అమ్ముకునేలా...
రైతులు తమ ఇంటి నుంచే దేశ విదేశాల్లో పంటలను విక్రయించుకునేలా మార్కెటింగ్‌ శాఖ నాగార్జున ఫెర్టిలైజర్స్‌తో ఎంవోయూఏ చేసుకుంది. కంపెనీ ప్రతినిధులు రైతుల వద్ద పంటలను వారి చెప్పిన రేటుకు కొనుగోలు చేసి మార్కెట్లలో విక్రయిస్తారు. ఈ విధానంలో రైతులు ఏమాత్రం శ్రమకు గురికాకుండా, కమీషన్లు చెల్లించే పని లేకుండా పంటను ఇంటి నుంచే అమ్ముకోవచ్చు. వీటితోపాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, జనతా బజార్ల ఏర్పాటుకు కూడా సన్నాహాలు మొదలయ్యాయి.

సాగు మాది.. శ్రమ సర్కారుది
ఇప్పుడు మేం సాగు ఒక్కటే చేస్తున్నాం. మిగిలినదంతా ప్రభుత్వమే చూసుకుంటోంది. రైతు భరోసా ద్వారా ఆర్ధికసాయం అందిస్తోంది. విత్తనాలు, ఎరువులు, మందులు ఆర్బీకేల్లో దొరుకుతున్నాయి. ఈ–మార్కెటింగ్‌ ద్వారా ఇంటి నుంచే పంటను అమ్ముకునే విధానాన్ని ప్రభుత్వం తెస్తోంది. రైతు చేతిలో సొమ్ము పడిన తరువాతే సరుకు తరలించే కొత్త విధానాలను ముఖ్యమంత్రి జగన్‌ రూపొందించడం బాగుంది.
–  మారెడ్డి సుబ్బారెడ్డి, ప్రకాశం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు