ఏపీ: గురుకులాల్లో వినూత్నంగా బోధన

5 Jul, 2021 10:28 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో విలేజ్‌ లెర్నింగ్‌ సర్కిల్స్‌ ఏర్పాటు

ఆటపాటలతో చదువు కొనసాగేలా సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక చర్యలు

రాష్ట్రంలో 26 గురుకుల పాఠశాలల పరిధిలో అమలు

మూడు నుంచి 12 మంది విద్యార్థులతో ఒక గ్రూపు

ప్రత్యేకంగా ఉపాధ్యాయులతో బోధన

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా చదువుకు నోచుకోలేకపోతున్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గురుకుల పాఠశాలల పరిధిలో ఆటపాటలతో విద్యార్థులు చదువు కొనసాగేలా గ్రామ అభ్యస బృందాలను (విలేజ్‌ లెర్నింగ్‌ సర్కిల్‌) ఏర్పాటుచేసింది. ఇందుకు జిల్లాకు రెండేసి గురుకులాలను ఎంపికచేసి వాటికి గ్రామ అభ్యస బృందాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. ఇలా రాష్ట్రంలోని 26 గురుకుల పాఠశాల్లో ఆరు నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులను ఎంపికచేశారు. బోధన ప్రక్రియ ఈ నెల 1 నుంచి మొదలైంది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో చదివే విద్యార్థులు ముగ్గురు నుంచి పది మందిని ఒక గ్రూపుగా ఏర్పాటుచేశారు.

ఒక్కో గ్రామంలో గురుకుల విద్యార్థులు పన్నెండు మంది కంటే ఎక్కువగా ఉంటే రెండో గ్రూపు ఏర్పాటుచేశారు. ప్రతి బృందానికి విడిగా వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటుచేసి వారికి అవసరమైన సమాచారం అందించే ఏర్పాట్లుచేశారు. అలాగే, ప్రతి గ్రూపునకు సబ్జెక్టుల వారీగా విద్యాబోధన చేసేలా ఉపాధ్యాయులను నియమించారు. గ్రామంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ కనీసం గంట నుంచి రెండు గంటలపాటు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. పాఠాలతోపాటు ఆటపాటలు కూడా గురుకుల విద్యార్థులకు నేర్పించి వారిలో ఉత్సాహం నింపేలా చర్యలు చేపట్టడం విశేషం. కాగా, గ్రామ అభ్యస బృందాలకు సీనియర్‌ విద్యార్థి నాయకత్వం వహిస్తాడు. ఈ బృందాలను పూర్వ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ వలంటీర్‌లు పర్యవేక్షిస్తారు. 

స్పందన బాగుంది 
రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి ప్రారంభించిన విలేజ్‌ లెర్నింగ్‌ సర్కిళ్లకు స్పందన బాగుంది. పూర్తిస్థాయిలో ఈ బృందాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లాల అధికారులకు ఆదేశాలిచ్చాం. సెల్‌ఫోన్‌లు అందరికీ ఉండే అవకాశం లేనందున నేరుగా గ్రామ అభ్యస బృందం పేరుతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటుచేసి నేరుగా ఉపాధ్యాయులే ఆయా సబ్జెక్టుల్లో బోధించే ఏర్పాటుచేశాం. ఒక్కోసారి ఉపాధ్యాయుడు వేరొక ప్రాంతం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పాఠాలు చెప్పినా గ్రామ అభ్యస బృందంలో ఏ ఒక్కరైనా మొబైల్‌ ఫోన్‌ ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉండదు.
– బండి నవ్య, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ 

మరిన్ని వార్తలు