వ్యాక్సిన్‌ వేయించుకోండి.. వివాహానికి రండి!

21 Mar, 2021 04:43 IST|Sakshi
వరుడు గోకుల్‌ను సన్మానిస్తున్న నరేంద్రరెడ్డి

గుంటూరు జిల్లాలో పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యుల వినూత్న ఒరవడి    

గుంటూరు మెడికల్‌ : కరోనా రెండో దశ ప్రారంభమై పలు రాష్ట్రాలు, దేశాల్లో లాక్‌డౌన్‌ విధించడంతో గుంటూరు జిల్లాలోని ఓ కుటుంబం వినూత్న ఒరవడికి తెరతీసింది. తమ కుమారుడి వివాహానికి హాజరవ్వాలనుకునేవారు తప్పనిసరిగా కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటూ షరతు విధించింది. అంతేకాదు బంధువులంతా ముందుకొచ్చి శనివారం వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గుంటూరు సాయిభాస్కర్‌ హాస్పటల్లో ఒకేసారి వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరిగింది. సత్తెనపల్లికి చెందిన గోకుల్‌కు విజయవాడకు చెందిన భావ్యతో జనవరి 9న నిశ్చితార్థం జరిగింది. జూన్‌ 5న వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు.

నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి కొద్దికొద్దిగా కరోనా కేసుల పెరుగుదల ప్రారంభమైంది. దీంతో ఆ కుటుంబం అప్రమత్తమై శనివారం గుంటూరు సాయిభాస్కర ఆస్పత్రిలో ఒకేసారి 20 మంది, విజయవాడలో భావ్య కుటుంబ సభ్యులు 20 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. వివాహానికి హాజరయ్యే బంధువులంతా తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలంటూ వాట్సాప్‌ల ద్వారా, ఫోన్లు చేసి మరీ సమాచారమిచ్చారు. వ్యాక్సిన్‌ కోసం ఒకేసారి వచ్చిన కుటుంబ సభ్యులను సాయిభాస్కర్‌ హాస్పటల్‌ అధినేత, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి అభినందించారు. పెళ్లి కుమారుడు గోకుల్‌తో పాటు, పెళ్లి కుమార్తె భావ్య కుటుంబ సభ్యులనూ సన్మానించారు. జర్నలిస్టు కుటుంబ సభ్యులకు, తెల్లరేషన్‌ కార్డువారికి అరండల్‌పేటలోని తమ ఆస్పత్రిలో ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తున్నట్టు బూసిరెడ్డి వివరించారు.  

మరిన్ని వార్తలు