సబ్‌ రిజిస్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు

4 Sep, 2021 05:04 IST|Sakshi
జమ్మలమడుగు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేస్తున్న ఏసీబీ అధికారులు

38 కార్యాలయాల్లో బయటపడిన నకిలీ చలానాలు 

రూ.8.13 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి

50 శాతానికి పైగా రికవరీ

సాక్షి, అమరావతి/ఒంగోలు సబర్బన్‌/జమ్మలమడుగు రూరల్‌: నకిలీ చలానాల నిగ్గు తేల్చేందుకు రాష్ట్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కోసం తీసిన చలానాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటివరకు 38 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాల గుట్టు బయటపడింది. అనంతపురం మినహా అన్ని జిల్లాల్లో ఈ కుంభకోణం జరిగినట్టు తేలింది. ఎక్కువగా పశ్చిమ గోదావరిలోని 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలానాలు  బయటపడగా రూ.28.58 లక్షలు పక్కదారి పట్టాయి.

విజయనగరం జిల్లాలోని 6 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రూ.36.14 లక్షలు తేడా వచ్చింది. కృష్ణా జిల్లాలోని 6 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రూ.4.20 కోట్లు, గుంటూరు జిల్లాలో 5 కార్యాలయాల్లో రూ.9.25 లక్షలు దారి మళ్లాయి. వైఎస్సార్‌ జిల్లాలో రెండు ఆఫీసుల్లోనే నకిలీ చలానాలు గుర్తించినా రూ.1.29 కోట్ల మొత్తం తేడా వచ్చింది. విశాఖ జిల్లాలోని రెండు కార్యాలయాల్లో రూ.1.39 కోట్లు దారి మళ్లాయి. మొత్తంగా ప్రభుత్వ ఖజానాలో జమ కావాల్సిన రూ.8.13 కోట్లు పక్కదారి పట్టినట్టు గుర్తించారు.

ఇందులో రూ.4.62 కోట్లను ఇప్పటికే రికవరీ చేశారు. వైఎస్సార్, విశాఖ, విజయవాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో మొత్తం సొమ్మును రికవరీ చేయగా.. మిగిలిన జిల్లాల్లో రికవరీ జరగాల్సి ఉంది. 38 కార్యాలయాల్లో ఇప్పటివరకు 14 మందిని విధుల నుంచి తప్పించారు. అందులో 9మంది సబ్‌ రిజిస్ట్రార్లు ఉన్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లు, ఇతరులపై 33 కేసులు నమోదు చేశారు. రెండేళ్లుగా రిజిస్ట్రేషన్‌ అయిన 60 లక్షలకుపైగా డాక్యుమెంట్లను తనిఖీ చేసేందుకు ప్రణాళిక రూపొందించిన అధికారులు ఇప్పటికే చాలావరకు తనిఖీలు పూర్తి చేశారు. 

ఒంగోలులోనూ నకిలీ చలానాల కలకలం
ప్రకాశం జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో వారం రోజులుగా విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ డీఐజీ పి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో 18 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ జాయింట్‌–1, జాయింట్‌–2 పరిధిలో నకిలీ చలానాల ద్వారా స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తేల్చారు. మొత్తం 71 రిజిస్ట్రేషన్ల ద్వారా 77 ఈ–చలానాలను సృష్టించారు. వీటిద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.26,74,850 మొత్తాన్ని చెల్లించకుండానే నకిలీ చలానాల ద్వారా మోసం చేసినట్టు తేలింది. ఇప్పటివరకు బయటపడిన నకిలీ చలానాలన్నీ ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఉండే డాక్యుమెంట్‌ రైటర్‌ కాజా పవన్‌కుమార్‌ ఒక్కడే చేసినట్టు నిర్ధారణ అయింది. రూ.26,74,850 మొత్తం రాబట్టామని ఒంగోలు సబ్‌ రిజిస్ట్రార్‌ జాయింట్‌–2 షేక్‌ జాఫర్‌ తెలిపారు. పవన్‌కుమార్‌ పరారీలో ఉన్నాడని, అతనిపై పోలీస్‌స్టేషన్‌లో గురువారం రాత్రి ఫిర్యాదు చేశామని చెప్పారు.   

జమ్మలమడుగులో ఏసీబీ సోదాలు
వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. కడప ఏసీబీ డీఎస్పీ పి.కంజాక్షన్‌ ఆధర్వంలో సీఐలు టి.రెడ్డెప్ప, ఎస్‌.రామాంజనేయులు, కృష్ణమోహన్‌ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ కంజాక్షన్‌ మాట్లాడూతూ ముందస్తు సమాచారం మేరకు సోదాలు నిర్వహించామని చెప్పారు. కార్యాలయ ఆవరణలో అనధికారికంగా ఉన్న ఐదుగురు దస్తావేజు లేఖరుల నుంచి రూ.84,040 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యాలయంలో అవకతకలు జరిగాయా అనే కోణంలో కక్షిదారులను విచారించారు.

మరిన్ని వార్తలు