25 కోవిడ్‌ ఆస్పత్రుల్లో తనిఖీలు 

28 Apr, 2021 03:16 IST|Sakshi
ఓ కోవిడ్‌ ఆస్పత్రిలో సోదాలు చేస్తున్న విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా 18 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు

4 ఆస్పత్రుల్లో అక్రమాల గుర్తింపు

విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్ర  ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసిన 18 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలతో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన మేరకు.. రాçష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయిల్లో విజిలెన్స్‌ అధికారులు, వైద్యాధికారులు, ఔషధ నియంత్రణ అధికారులు, సంబంధిత అధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు రాష్ట్రంలోని 25 ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలను కరోనా బాధితుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేశాయి. ఆ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, కరోనా మందుల నిల్వలు, సరఫరాలను కూడా సమీక్షించాయి. తనిఖీల సందర్భంగా నరసరావుపేటలోని పువ్వాడ హాస్పిటల్స్‌లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్టు గుర్తించాయి. తిరుపతి రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నట్టు గుర్తించాయి.

విజయనగరం క్వీన్స్‌ ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్, ఒంగోలులోని ప్రకాశం హాస్పిటల్‌లో అవసరానికి మించి రోగుల పేరుతో ఇండెంట్‌ పెట్టి రెమ్‌డెసివిర్, ఇంజక్షన్లు తీసుకున్నట్టు గుర్తించాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా వ్యాధి చికిత్సలు అందించాలని సూచించారు.   

మరిన్ని వార్తలు