ఈ నెల 18 నుంచి 21 వరకు వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లలో తనిఖీలు 

16 Jun, 2022 08:42 IST|Sakshi

సిబ్బంది, ఔషధాలు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా

తనిఖీల కోసం ప్రత్యేక యాప్‌

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యసేవల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా అందుతున్న సేవల్లో నాణ్యతను పరిశీలించేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు విలేజ్‌ క్లినిక్‌లలో ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీలు నిర్వహించి సేవలపై ఆరా తీయనున్నారు.
చదవండి: AP: సచివాలయాలు సూపర్‌.. కేంద్ర మంత్రి ప్రశంసలు

ప్రత్యేక యాప్‌ రూపకల్పన 
వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లలో తనిఖీల కోసం ఏపీహెచ్‌ఎస్‌ఎస్‌పీ–ఎస్‌సీ–హెచ్‌డబ్ల్యూసీ పేరిట ప్రత్యేక యాప్‌ను వైద్య ఆరోగ్య శాఖ రూపొందించింది. ప్రత్యేక బృందాలు పరిశీలించాల్సిన అంశాలతో ఓ ప్రశ్నావళి రూపొందించారు. తనిఖీల్లో వెల్లడైన అంశాల ఆధారంగా లోటుపాట్లను సరిదిద్దేలా చర్యలు చేపట్టనున్నారు.

సొంతూరిలోనే మెరుగైన వైద్యం 
గ్రామ స్థాయిలోనే ప్రజలకు మెరుగైన ప్రాథమిక వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున 10,032 క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆరు వేలకు పైగా క్లినిక్‌లు అందుబాటులోకి రాగా వీటి ద్వారా గర్భిణులు, చిన్నారులు.. నవజాత శిశువుల ఆరోగ్య సంరక్షణ, అంటు వ్యాధుల నివారణ లాంటి 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 67 రకాల మందులు గ్రామాల్లోనే అందుతున్నాయి.

వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.1,692 కోట్లతో 1,498 భవనాలకు మరమ్మతులు, 8,534 కొత్త భవనాల నిర్మాణం చేపడుతున్నారు. మరమ్మతులు ఇప్పటికే పూర్తయ్యాయి. బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత కలిగిన  ఎంఎల్‌హెచ్‌పీ వీటిల్లో సేవలందిస్తున్నారు. ఇప్పటికే 8,347 మంది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం పూర్తయింది. సగటున రోజూ క్లినిక్‌లలో 23 ఓపీలు, ఎనిమిది పరీక్షలు నమోదు అవుతున్నాయి. టెలిమెడిసిన్‌ ద్వారా క్లినిక్‌లలో స్పెషలిస్ట్‌ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. నిత్యం సగటున 4,500 మంది టెలిమెడిసిన్‌ వైద్య సేవలు పొందుతున్నారు.

తనిఖీల్లో వీటిపై దృష్టి
అర్హులైన వైద్యుల ద్వారా క్లినిక్‌లలో రోగులకు టెలిమెడిసిన్‌ సేవలు అందుతున్నాయా?  
జీవన శైలి జబ్బుల స్క్రీనింగ్‌పై ఏఎన్‌ఎం, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)లకు శిక్షణ పూర్తయిందా? 
అవసరమైన ఔషధాల జాబితాలోని 70% మందులు అందుబాటులో ఉన్నాయా? 
ప్రజలకు 12 రకాల వైద్య సేవలు సమగ్రంగా అందుతున్నాయా?   

మరిన్ని వార్తలు