కుటుంబాన్ని రిపేర్‌ చేస్తున్న మెకానిక్‌ రాధ

18 Aug, 2022 08:44 IST|Sakshi

ఆ గ్యారేజ్‌లో రెంచ్‌లు, స్క్రూ డైవర్ల సందడితో గాజుల చప్పుడు కలిపి వినిపిస్తుంది.  గ్రీజు అంటుకుపోయిన దుస్తులతో ఎప్పుడూ కనిపించే మెకానిక్‌ కాకుండా ఓ స్త్రీ చేతిలో రెంచీతో కొత్తగా కనిపిస్తుంది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో ఉందీ మెకానిక్‌ షెడ్‌. భర్తకు     అండగా నిలవడానికి భార్య మెకానిక్‌గా మారిన ఈ కథ ఆసక్తికరం. మట్టి అంటిన చేతులు నిజాయితీకి నిలువుటద్దాలు అంటారు కదా.. అలా నిజాయితీ కలిగిన ఓ మహిళ కథ ఇది.  

శ్రీకాకుళం: మహిళలు చాలా రంగాల్లో రాణిస్తున్నారు. చాలా మంది టీచర్లయ్యారు, ఇంకొందరు ప్రైవేటు సెక్టార్లలో రాణిస్తున్నారు, మరికొందరు రాజకీయా ల్లో ఉన్నత పదవులు అధిరోహిస్తున్నారు.. అలా రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసే తత్వం ఉంటే రంగంతో పని లేదని నిరూపిస్తున్నా రు ఈమె. వాస్తవానికి బైక్‌ మెకానిక్‌ రంగం మగాళ్ల రాజ్యం. రోజంతా దుమ్ము, ధూళి, గ్రీజులతో ఈ పని మొరటుగా ఉంటుంది. కానీ కుటుంబానికి తోడుగా ఉండేందుకు ఈ పనిని కూడా ఆమె బాధ్యతగా నెత్తికెత్తుకుంది.   

► పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం రోడ్డులో గిరి మెకానిక్‌ షా పు ఉంది. అక్కడే రాధ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఎలాంటి వాహనం వచ్చినా ఇట్టే సమస్యను పసిగట్టి పరిష్కరించి పంపిస్తారు. వాస్తవానికి రాధ బైక్‌ మెకానిక్‌ పనులేవీ నేర్చుకోలేదు. కాలం ఆమెను ఈ రంగం వైపు నడిపించింది. 

► పదహారేళ్ల కిందట రాధకు పోల గిరితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరి స్వ స్థలం ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా రంభ గ్రామం. అక్కడ ఉపాధి లేక పలాస వరకు వలస వచ్చారు. గిరికి బైక్‌ మెకానిక్‌ పనులు తెలుసు. కానీ ఆయనకు సరిగ్గా వినిపించదు. దీంతో వ్యాపారంపై ఆ ప్రభావం పడింది. కస్టమర్లు రావడం.. సమస్యను చెప్పడానికి ఆపసోపాలు పడడంతో గిరికి గిరాకీ తగ్గింది.  

కోవిడ్‌ రాకతో.. 
► అసలే వ్యాపారం అంతంతమాత్రంగా ఉంటే అప్పుడే కోవిడ్‌ కేసులు ఉద్ధృతం కావడం మొదలయ్యాయి. ఫలితంగా ఉన్న ఉపాధి కాస్తా పోయింది. షెడ్‌కు బళ్లు రావడం మానేశాయి. ఓ వైపు కుటుంబానికి తిండీ తిప్పలు, ఇంటి అద్దె, షాపు అద్దె కట్టాల్సి రావడంతో వీరికి ఏం చేయాలో పాలుపోలేదు. 

► ఈ కష్టకాలంలో గిరి భార్య రాధ ఆదర్శ ప్రాయమైన నిర్ణయం తీసుకున్నారు. తాను షెడ్‌లో ఉంటే తప్ప పరిస్థితులు చక్కబడవని గ్రహించి మెకానిక్‌ పనులు నేర్చుకోవడం మొదలుపెట్టారు. 

భర్త తోడుతో..  
కోవిడ్‌ కాలంలో అద్దెల భారం పెరిగి కరోనా సమయంలో ఉపాధి లేక పస్తులు పడ్డా రు. పనిచేసేందుకు ఎవరినైనా పెడదామంటే అంత జీతాలు ఇవ్వలేని పరిస్థితి. దీంతో రాధ స్వయంగా రోజూ దుకాణానికి వచ్చి సాయం చేసేది. సందేహాలు వస్తే గూగుల్, యూట్యూబ్‌లో వీడియోలు చూసి కొన్ని నేర్చుకునేవారు. కరోనా సమయంలో ఇంటి వద్దకు కొన్ని వాహనాలు వస్తే కాదనకుండా మరమ్మతులు చేసి పంపించేవారు. భర్తే ఆమెకు దగ్గరుండి విద్య నేర్పడం గమనార్హం. భర్త నేరి్పన విద్యతో అన్ని రకాల మరమ్మతులు చేస్తూ బైక్‌ మెకానిక్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. సాధారణ వాహనాలతో పాటు పాతకాలం నాటి యమహా క్రక్స్‌ వంటి వాహానాలను కూడా ఆమె బాగు చేయగలరు.బీఎస్‌ 2 నుంచి బీఎస్‌ 6 వరకు స్కూటీలు, మోటారుసైకిళ్లు బాగు చేస్తున్నారు. భార్యాభర్తలం కష్టపడితేనే పైసలు కనిపిస్తున్నాయని, అందుకే సిగ్గు పడకుండా ఈ వృత్తిలో కొనసాగుతున్నానని ఆమె చెబుతున్నారు. పిల్లలను చక్కగా చదివించుకుని ఇక్కడే స్థిరపడాలని ఉందని ఆమె తెలిపారు.   

మరిన్ని వార్తలు