దివ్యాంగులు.. స్ఫూర్తి గాథలు

11 Oct, 2020 11:35 IST|Sakshi

ప్రొద్దూటూరు/రాజంపేట టౌన్‌/ రూరల్‌/ జమ్మలమడుగు/సంబేపల్లె/అట్లూరు/ చాపాడు: వారంతా దివ్యాంగులే... పుట్టుకతో విధి వంచితులే.. అయినా బెదరలేదు.. కన్నీరు కార్చలేదు.. పట్టుదల, ఆత్మస్థైర్యంతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఒకరిపై ఆధారపడకుండా, వ్యాపారం చేసుకుంటూ  తమదైన నైపుణ్యంతో రాణిస్తూ, ఆదాయం పొందుతూ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. పదుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ అధైర్యపడకుండా ఒకరి సాయం కోసం ఎదురుచూడకుండా జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని కొంతమంది దివ్యాంగులపై ప్రత్యేక కథనం.


చిరు వ్యాపారమే ఆసరా

ఇక్కడ కన్పిస్తున్న దివ్యాంగుడి పేరు ప్రొద్దుటూరు రెహామాన్‌. మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డు కాల్వకట్ట వద్ద నివాసం ఉంటున్నాడు. రోడ్డు పక్కన చిన్న బంకు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. గతంలో సంచులు కుట్టేవాడు. ‘‘కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడ్డానని, లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారం బాగా జరుగుతోందని, పెట్టుబడి పోయి మిగిలిన ఆదాయంతో పాటు, ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని’’ చెబుతున్నాడు.



మొక్కవోని ధైర్యంతో.. 
ఇతని పేరు అహమ్మద్‌బాషా. పుట్టుకతోనే దివ్యాంగుడు. రాజంపేట పట్టణం రైల్వేస్టేషన్‌ సమీపంలో టైలరింగ్‌ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. కరోనాతో ఆదాయం పూర్తిగా పడిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో షాపు మూసివేశాడు. ప్రస్తుతం చౌకదుకాణంలో నెలకు రెండుమార్లు ఇచ్చే రేషన్‌ బియ్యం, సరుకులతో భార్య, డిగ్రీ చదివే ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ షాపులో కూర్చుంటే కనీసం రూ. 100 వస్తుందన్న ఆశ ఇతనిది. కరోనా ఇబ్బందులు తాత్కాలికమే అంటూ, ధైర్యంతో మొండిగా బతుకుబండిని లాగుతున్నట్లు చెబుతున్నాడు


రెక్కల రిక్షా
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఈ దివ్యాంగుని పేరు కరీముల్లా. చిన్నప్పుడే ప్రమాదంలో కుడిచేతిని పోగొట్టుకున్న ఈయన ఎంతో ధైర్యంగా జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకంగా రిక్షాను తయారు చేయించుకుని సీజన్‌ వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం రోజూ హోల్‌సేల్‌ మార్కెట్‌లో వేరుశనగ కాయలు కొని ఊరంతా తిరిగి విక్రయిస్తాడు. సీజన్‌ను బట్టి రేగిపండ్లు, జామకాయలు, మామిడికాయలు అమ్మి జీవనం సాగిస్తున్నాడు. మరో విశేషం ఏమిటంటే ఈయన సతీమణి ఖాదర్‌బీ దివ్యాంగురాలే. చిన్నప్పుడే పోలియోతో కాలు చచ్చుబడిపోయింది. సతీమణి ఇంటిలో అన్నం వండిపెట్టడం మినహా ఏ పని కావాలన్నా తాను ఒంటిచేత్తోనే చేస్తానని ఎంతో ధైర్యంతో కరీముల్లా ఈ సందర్భంగా చెబుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


వెరీ ‘గుడ్డు’రఫి
జమ్మలమడుగుకు చెందిన మహమ్మద్‌రఫి పుట్టుకతోనే పోలియో సోకడంతో దివ్యాంగుడిగా మారాడు. ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా కోడి గుడ్ల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరోనా నేపథ్యంలో దుకాణాలు మూతపడి వ్యాపారం కుంటుపడింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా మళ్లీ దుకాణాలు తెరుచుకున్నాయి. మరోవైపు కరోనా మహమ్మారిని జయించడంలో గుడ్డు ఎక్కువగా సహకరిస్తుందన్న డాక్టర్ల సూచనతో వ్యాపారం ఇప్పుడు పరుగులు పెడుతోంది. దీంతో రఫీ రోజంతా బిజీబిజీగా ఉంటున్నాడు.


సేవకుడయ్యాడు..
రాజంపేటకు చెందిన ఎన్‌. శ్రీనివాసులు డిగ్రీ వరకు చదివాడు. తండ్రి అనారోగ్యం పాలై మంచం పట్టాడు. ఇతనికి తల్లి, ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. కుటుంబ పోషణ శ్రీనివాసులుపైనే పడింది. పెద్దతమ్ముడికి సెలూన్‌షాపు ఏర్పాటు చేయించాడు. మరో సోదరుడిని చదివిస్తున్నాడు. జననేత ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థతో 19వ వార్డులో ప్రస్తుతం వలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. ప్రజలకు సేవ చేస్తున్నాడు.


బతుకు ‘చిత్రం’ ఇదే..
ఏపీ దివ్యాంగుల సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న షాకీర్‌హుసేన్‌ పట్టణంలోని ఓ ఫొటో స్టూడియోలో ఆల్బమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ స్టూడియోకు వెళ్లి కంప్యూటర్‌లో ఫొటోలు డిజైన్‌ చేస్తున్నాడు. ఒక్కో ఫొటోకు రూ.3 చొప్పున తనకు కమీషన్‌ ఇస్తారని, రోజూ 200 ఫొటోలుపైగా డిజైన్‌ చేస్తానని ఈ సందర్భంగా షాకీర్‌ తెలిపాడు.


కుట్టుకుంటూ.. నెట్టుకుంటూ
సంబేపల్లె మండలం పీఎన్‌కాలనీ పంచాయతీ రేగడగుంటపల్లెకు చెందిన ఈశ్వరయ్యకు రెండు కాళ్లు లేవు. అయినా కష్టపడి టైలరింగ్‌ చేస్తూ అమ్మానాన్నకు ఆసరాగా ఉంటూ వచ్చాడు. దురదృష్టవశా>త్తూ కన్నవారు కూడా కాలం చేశారు. ఆత్మస్థైర్యంతో తను నేర్చుకున్న చేతి వృత్తితో కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఒకరి మీద ఆధారపడకుండా సొంతంగా జీవనం సాగిస్తున్నాడు.

 
తల్లి కోసం
రాజంపేట మండలం ఎర్రబల్లికి చెందిన ఖమ్మం నాగేంద్రరెడ్డి బీఎస్సీ, బీఈడీ చదివాడు. తండ్రి మరణించడంతో తల్లిని పోషించేందుకు చిన్న పాటి కిరాణా షాపును ఏర్పాటు చేసుకున్నాడు. చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోయినా నిరాశ చెందకుండా జీవనం సాగిస్తున్నాడు. షాపులో వచ్చిన ఆదాయంతో తల్లిని బాగా చూసుకుంటున్నాడు.


కష్టాలకు బెదరలేదు..
ఈ ఫొటోలేని వ్యక్తి పేరు మద్దూరు నరసింహులు. అట్లూరు మండలం కొండూరు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. పుట్టుకతోనే దివ్యాంగుడు. అవయవాలు ఎదగలేదు. అయితే టైలర్‌ పని నేర్చుకున్నాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇద్దరి పిల్లలకు తండ్రి అయ్యాడు. కరోనా కష్టాల్లోనూ బెదరకుండా టైలరింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.



అందరికీ అండగా ..
రాజంపేట మండలం మన్నూరు గ్రానికి చెందిన షేక్‌ జైనులు దివ్యాంగుడు. డిగ్రీ చదివాడు. తల్లి, భార్య, కుమార్తె, తమ్ముడు ఉన్నారు. అందరినీ పోషించాల్సిన బాధ్యత జైనులుపై పడింది. ఇంటిలోనే టైలరింగ్‌ చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇతని పట్టుదల కింద వైకల్యం ఓడిపోయింది. 

మరిన్ని వార్తలు