టీచర్‌ నుంచి పోలీస్‌ వరకు.. ఆమె ప్రయాణం వింటే హ్యాట్సాఫ్‌ అనాల్సిందే!

7 Apr, 2022 13:03 IST|Sakshi

అంచెలంచెలుగా ఎదిగిన ఎస్పీ రాధిక 

లెక్చరర్‌గా పనిచేస్తూ గ్రూప్‌–1కు ఎంపిక

ఆరు ఖండాల్లో పర్వతాల అధిరోహణ 

శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ కర్తవ్యం

ఖండఖండాంతరాల్లో పర్వతాలు అధిరోహించేలా శిఖరాగ్రానికి ఆహ్వానం పలికాయి. పోలీస్‌ విధుల్లోనూ ప్రశంసలు నక్షత్రాలుగా భుజాలపై మెరిశాయి. కృషి, పట్టుదలే ఆలంబనగా పలువురు మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు సిక్కోలు కొత్త ఎస్పీ జీఆర్‌ రాధిక. అటు పర్వతారోహణలో మేటిగా నిలిచిన ఆమె ఇటు పోలీస్‌ డ్యూటీలో కూడా ఘనాపాటిగా నిరూపించుకున్నారు. లెక్చరర్‌గా పనిచేస్తూ గ్రూప్‌ 1 ద్వారా పోలీస్‌ బాసయ్యారు. ఎస్పీ అయ్యేనాటికే ఆరు ఖండాల్లోని పర్వతాలు ఆమె పాదాక్రాంతం అయ్యాయి. తాజాగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆమె సిక్కోలు శాంతిభద్రతలకే తొలి ప్రాధాన్యం అంటున్నారు. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  సవాళ్లను స్వీకరించడం కొందరికి సరదా. అలాంటి కోవకే వస్తారు జిల్లా కొత్త ఎస్పీ జిఆర్‌ రాధిక. ఓవైపు వృత్తి.. మరోవైపు కుటుంబం.. అయినా తాను అనుకున్నది సాధించే వరకు వదల్లేదు. కొన్ని పనులను కేవలం మగవారే చేయగలరన్న నానుడికి స్వస్తి పలికి తాము కూడా చేయగలమని నిరూపించిన వారిలో రాధిక ఒకరు. ఎంచుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ సమయంలో సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. విజయవంతంగా ముందుకు సాగుతున్న ఆమె ‘సాక్షి’ ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.    

బాల్యం, విద్యాభ్యాసం..  
పుట్టింది అనంతపురంలో. బాల్యం, విద్యాభ్యాసం అంతా కడపలోనే. ఇంటర్మీడియెట్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో పూర్తిచేశా. పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌(ఎంఏ ఇంగ్లీష్‌ లిటరేచర్‌) ఎస్వీ యూనివర్సిటీ తిరుపతిలో చేశాను.   

తొలి ఉద్యోగం ఇంగ్లిష్‌ లెక్చరర్‌..  
ఏపీపీఎస్సీలో జూనియర్‌ లెక్చరర్‌ (ఇంగ్లీష్‌)గా 2002లో ఎంపికై మెదక్‌లో మూడేళ్లు పనిచేశాను. తర్వాత కర్నూలులో ఉద్యోగం చేస్తుండగానే 2007లో గ్రూప్‌–1కు ఎంపికయ్యాను. మెదక్‌లో లెక్చరర్‌గా ఉన్నప్పుడు ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రామ్‌ ఆఫీసర్‌గా చేశా. నాన్న టీచర్, అమ్మ రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌. మాది కులాంతర ప్రేమ వివాహం. భర్త బిజినెస్‌ చేస్తున్నారు. ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి ఎంఎస్‌ ఫైనలియర్, చిన్నబ్బాయి బీటెక్‌ ఫస్టియర్‌. ఇద్దరూ యూఎస్‌లో చదువుతున్నారు. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు అంతా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడినవారే.  

చాలెంజింగ్‌ జాబ్స్‌ ఇష్టం.. 
ప్రతి రోజూ జిమ్, సైక్లింగ్, వాకింగ్‌ చేస్తూ ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యమిస్తాను. ఆరోగ్యంగా ఉండాలి.. ఇతరులకు సాయపడాలి. ఇలాంటి ఆలోచనలు ఉంటేనే మానవ జీవితానికి సార్థకత ఉంటుంది. చాలెంజింగ్‌ జాబ్స్‌ అంటే  ఇష్టం. అవార్డులు చాలా వచ్చాయి. 

రోల్‌ మోడల్‌: రాజీవ్‌ త్రివేది 
    సీఐడీ డీజీ సునీల్‌కుమార్‌ టెక్నాలజీని ఉపయోగించే విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. వినూత్నమైన ఆలోచనలతో కొత్త యాప్‌ల ద్వారా డిపార్ట్‌మెంట్‌ని తీర్చిదిద్దుతున్నారు. 
బెస్ట్‌ ఫ్రెండ్‌: ఇండియా హాకీ టీమ్‌ గోల్‌కీపర్‌ రజిని(చిత్తూరు) 
అభిరుచులు: బుక్‌రీడింగ్, రైటింగ్‌ 
చాలా ఇష్టం: యాక్షన్, హర్రర్, థ్రిల్లర్‌ పోలీసింగ్‌ వంటి సినిమాలు  

అన్ని జీవరాశుల్లో మానవ జన్మ గొప్పది. దీన్ని ప్రతి ఒక్కరూ అదృష్టంగా భావించాలి. దేవుడిపై నమ్మకంతో మనుగడ సాగిస్తే సంతోషంగా ఉండవచ్చు. ప్రతి సమస్య నుంచి ఒక పాఠం నేర్చుకుంటా. ప్రతి దాన్ని సవాలుగా స్వీకరిస్తా.  

పర్వతారోహణ మొదలైందిలా.. 
2012లో మానస సరోవర్‌ యాత్రకు వెళ్లాను. ఎవరెస్ట్‌ శిఖరం అధిరోహించాలంటే ముందుగా 45 రోజుల మౌంటెనింగ్‌ కోర్సు పూర్తి చేయాలి. దీనికోసం నాతో పాటు మరో ఇద్దరు మేల్‌ కానిస్టేబుళ్లు దరఖాస్తు చేశారు. డిపార్ట్‌మెంట్‌ పర్మిషన్‌ కోసం పెట్టాను. మౌంటెనింగ్‌ కోర్సు కాశ్మీర్‌లో చేయాల్సి ఉంది. లేడీ ఆఫీసర్‌ని అంతదూరం పంపించడం సేఫ్‌ కాదని అడిషనల్‌ డీజీ రాజీవ్‌ త్రివేది వద్దన్నారు. ఎలాగైనా అనుమతి ఇవ్వాలని, ప్రైవేటుగా డబ్బులు పెట్టుకుని వెళ్లడానికి సిద్ధపడి ప్లాన్‌ బీ పెట్టుకున్నాను. ఈలోపు ఇద్దరు కానిస్టేబుళ్లకు రిజర్వేషన్‌ దొరక్కపోవడంతో నాకు అవకాశం వచ్చింది.      

ఆరు ఖండాల్లో శిఖరాలు అధిరోహించా..  
సెవెన్‌ సమ్మిట్‌ చాలెంజ్‌ విన్నాను. ఏడు ఖండాల్లో ఎత్తైన శిఖరాలు అధిరోహించడమే  లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ దిశగానే ప్రయత్నం చేసి ముందుగా లడఖ్‌లోని జాస్కర్‌ రేంజ్‌ పరిధిలో మౌంట్‌ గోలిప్‌ కాంగ్రీ(5995మీటర్లు)ని 2013 సెప్టెంబర్‌ 7న ఎక్కాను. తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌లోని మౌంట్‌ మెంతోసా(6443మీటర్లు), కార్గిల్‌లోని మౌంట్‌ కున్‌(7007 మీటర్లు) అధిరోహించాను.  

–సివెన్‌ సమ్మిట్‌ చాలెంజ్‌లో భాగంగా 2016 మే 20న ఎవరెస్ట్‌(8848మీటర్లు)తో ప్రారంభించాను. తర్వాత కిలిమంజారో(ఆఫ్రికా), ఆస్ట్రేలియా ఖండంలోని కొస్కియస్‌జ్కో, ఐరోపా ఖండంలోని ఎల్బ్రస్, దక్షిణా ఆమెరికా ఖండంలోని అకోన్కాగ్వా, అంటార్కిటికా ఖండంలోని విన్సన్‌ మౌంట్‌ , డెనాలీమౌంటెన్‌ ఎక్కాను. నార్త్‌ అమెరికాలోని అలెస్కాలో మాత్రం 300 మీటర్ల దూరానికి సమీపంలో వెనుదిరిగాను. 2021లో నేపాల్‌లోని ఇస్లాండ్‌ పర్వతాన్ని అధిరోహించాను. ఏపీ పోలీస్‌ అకాడమీ, హైదరాబాద్‌లో పోలీస్‌ ఉద్యోగంలో చేరాక ఫిజికల్‌ యాక్టివిటీవ్స్‌లో భాగంగానే శిఖరాలన్నీ ఎక్కే ప్రయత్నం చేశాను. డీఎస్పీగా విధుల్లో చేరాక ఈ అచీవ్‌మెంట్స్‌ అన్నీ సాధించగలిగాను.  అడిషనల్‌ ఎస్పీగా ఉన్నప్పుడు ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కాను. మౌంట్‌ కున్‌ని అధిరోహించిన మొదటి ఇండియన్‌ మహిళగా, ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి మహిళా పోలీస్‌ ఆఫీసర్‌గా రికార్డులు దక్కాయి.

మరిన్ని వార్తలు